జాతీయ వార్తలు

సమాజంలో అస్థిరతకు విపక్షాల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంత్ కబీర్‌నగర్ (యూపీ), జూన్ 28: స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు వాస్తవ పరిస్థితులను విస్మరించి లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ ప్రజల్లో అస్థిరతను సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. యూపీలోని సంత్‌కబీర్‌నగర్‌లో తొలిసారిగా పర్యటించిన మోదీ కవి కబీర్‌దాస్ 500వ వర్థంతి సందర్భంగా చద్దర్ కప్పి నివాళి అర్పించిన అనంతరం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఎమర్జన్సీని ప్రవేశపెట్టిన పార్టీ, దానిని వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు భారుూభారుూ అంటూ తిరుగుతున్నాయని, వారికి దేశంలో శాంతి కాని, ప్రజల అభివృద్ధి కాని అవసరం లేదని అన్నారు. దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొంటే దాని నుంచి లబ్ధి పొందుదామని ఈ పార్టీలు కాచుకుని చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని సమాజ్‌వాది, బహుజన సమాజ్ పార్టీలు స్వార్థపూరితమైనవని ఆయన వ్యాఖ్యానించారు. వారికి ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనవసరమని, వారు, వారి కుటుంబ సభ్యులు ఎదుగుదలే కావాలని మోదీ విమర్శించారు. ఇటీవల మాజీ సీఎం అఖిలేష్‌కు సంబంధించిన బంగ్లా వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ కొందరికి పేదల ఇళ్ల సమస్య కన్నా వారి ప్రభుత్వ బంగ్లా సమస్యే ముఖ్యమని అన్నారు. తాము ప్రవేశపెట్టిన ప్రధాని ఇళ్ల పథకం కింద పేదలకు లబ్ధి చేకూర్చడంలో అఖిలేష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పేదలకు ఈ పథకం కింద ఇళ్లు సమకూర్చమని తాము అనేకసార్లు అప్పట్లో అఖిలేష్ ప్రభుత్వానికి లేఖలను రాసినా లెక్కచేయలేదన్నారు. వారికి కోట్లు విలువచేసే బంగ్లాలు సమకూర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ పేదల సంక్షేమంపై ఎంతమాత్రం లేదని ఆయన విమర్శించారు. ఈ దేశంలో కబీర్, ఆ తర్వాత రాయిదాస్, మహాత్మా పూలే, మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను తొలగించడానికి ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ మహానుభావుల పేరుతో కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాఖ్ గురించి ఆయన ప్రస్తావిస్తూ సమాజంలో పలువురు ముస్లిం మహిళలు దీనిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారని, అయితే విపక్షాలు మాత్రం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ బిల్లును అడ్డుకుంటున్నాయని అన్నారు. తమ స్వార్థప్రయోజనాల కోసం వారు బలహీనమైన సమాజాన్ని కోరుకుంటున్నాయని, సామాజిక రుగ్మతల నుంచి ప్రజలు విముక్తి కావడం వారికి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన విమర్శించారు. రాముడు మనకు ఆదర్శ పురుషుడని, కవి కబీర్‌దాస్ లౌకిక, సంప్రదాయ, తటస్థ వ్యవస్థను ఆకాంక్షించాడని, అయితే నేటి సమాజంలో కొన్ని కుటుంబాలు తామే సమాజ ఉద్ధారకులుగా ప్రకటించుకుంటున్నాయని అన్నారు. ఇది కబీర్ సూక్తులకు విరుద్ధమని అన్నారు. పేదరిక నిర్మూలన పేరుతో కొన్ని పార్టీలు ఓటు రాజకీయాలకు పాల్పడుతూ పేదలు ఇంకా తమపైనే ఆధారపడేలా వ్యవహరిస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పేదరిక నిర్మూలనకు అనేక పథకాలను తీసుకువచ్చిందని ప్రధాని చెప్పారు. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ‘నూతన భారత్’ను నిర్మిస్తామన్న తమ హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.
చిత్రం..ఉత్తర ప్రదేశ్ మఘార్‌లో సంత్ కబీర్ దాస్ 500వ వర్ధంతి సందర్భంగా గురువారం ప్రారంభమైన రెండు రోజుల మహోత్సవ్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా చిత్రంలో ఉన్నారు