జాతీయ వార్తలు

జమిలి ఎంతమాత్రం సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించటం రాజ్యాంగ విరుద్ధమని, ఆచరణయోగ్యం కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ లా కమీషన్‌కు స్పష్టం చేసింది. 2019లో లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగవలసి ఉన్నందున ప్రస్తుతానికి జమిలి ఎన్నికలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆదివారం జమిలి ఎన్నికలపై లా కమిషన్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యారు. సువిశాల భారత దేశంలో రక,రకాల రాజకీయ సిద్ధాంతాలు, విధానాలు ఆచరణలో ఉన్నాయంటూ ఇలాంటి దేశంలో లోకసభ, శాసన సభల ఎన్నికలు ఒకేసారి జరిపించటం ఏ మాత్రం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమి ఎంత కాలం ఒకటిగా ఉంటుందో,సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం తన మనుగడను కొనసాగిస్తుందనేది చెప్పటం కష్టమని, ఈ నేపథ్యంలో లోక్‌సభ రద్దైన ప్రతిసారి దేశంలోని అన్ని శాసన సభలను రద్దు చేసి ఎన్నికలు జరిపించటం ఏ విధంగా సాధ్యం అవుతుందని తెలుగుదేశం ప్రశ్నించింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత 1957 నుండి 1967 వరకు లోక్‌సభ, ఆయా శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు
జరిగాయని, అందుకే జమిలి ఎన్నికలు కొత్తేమీ కాదని తెలుగుదేశం తెలిపింది. మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1957లో కేరళ శాసన సభను రద్దు చేశారని, 1970లో నాలుగవ లోక్‌సభ గడువుకంటే ముందే రద్దుకావడంతో ఎన్నికలు జరపవలసి వచ్చిందని వారు గుర్తు చేశారు. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1975లో అత్యవసర పరిస్థితిని విధించిన అనంతరం లోక్‌సభ గడువును ఒక సంవత్సరం పొడిగించారన్నారు. ప్రధాని మొరార్జీదేశాయి, ప్రధాని వీపీ సింగ్, దేవేగౌడ ప్రభుత్వాలు పూర్తి కాలం అధికారంలో కొనసాగలేదని గుర్తు చేస్తూ, సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి కాలం అధికారంలో ఉండే అవకాశాలు మృగ్యమైనప్పుడు జమిలి ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయని తెలుగుదేశం ప్రశ్నించింది. ఒక దేశం ఒక ఎన్నికలు మంచివే కావచ్చు కానీ దీని కోసం లోతైన అధ్యయనం, పరిశోధన, పటిష్టమైన ప్రణాలిక, రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని ఉద్ఘాటించింది. జమిలి ఎన్నికల కారణంగా ఆయా రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం మామూలు విషయం కాదని స్పష్టం చేసింది. వాజపేయి హయాంలో జరిగినట్లు లోక్‌సభను ఎన్నికైన ముప్పై రోజుల్లో రద్దు చేయవలసి వచ్చినటువంటి పరిస్థితులు జమిలి తరువాత ఎదురైతే అన్ని రాష్ట్రాల శాసన సభలను కూడా రద్దు చేస్తారా? అని తోట నరసింహం, రవీంద్రకుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐదు సంవత్సరాల పాటు నిలబడలేకపోతే ఏం చేస్తారని లా కమిషన్‌ను అడిగారు. 2019లో జమిలి ఎన్నికలు నిర్వహించి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ లభించక ఇతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అది కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగలేకపోతే రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల పరిస్థితి ఏమిటి అని కూడా తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. ఈ కారణాల మూలంగా ఒక దేశం ఒక ఎన్నికలు అనే విధానం రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బ తీస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వం లేదా సంకీర్ణ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగి రాష్ట్రాల్లో ఇందుకు విరుద్దంగా జరిగితే ఏం చేస్తారని అడిగారు. జమిలి ఎన్నికలు ఆచరణయోగ్య కాదని, దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం కూడా అసాధ్యమని తెలుగుదేశం స్పష్టం చేసింది. దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిపించటం ఎంత మాత్రం సులభం కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ కాల పరిమితిని తగ్గించుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లినా తాము మాత్రం గడువు ప్రకారమే శాసనసభకు ఎన్నికలు జరిపిచుకుంటామని తేల్చి చెప్పింది.