జాతీయ వార్తలు

ముంబయిని వదలని వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 9: ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. సవాయ్ ప్రాంతంలో సుమారు 300 మంది బయటకు కాలుపెట్టలేని పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితయ్యారు. రోడ్లు సెలయేర్లను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాకుల పైనుంచి వరద నీరు పారుతున్నది. ఒక సీజన్‌లో, ఒక రోజులో అత్యధిక వర్షపాతం సోమవారం నమోదైంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మోకాలులోతు నీళ్లు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం సరిగ్గా లేక, దట్టమైన మబ్బులు కమ్ముకొని ఉండడంతో, వాహనాలు నడపడం అసాధ్యంగా మారింది. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్‌డే సెలవు ప్రకటించారు. అదే విధంగా సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్టు ముంబయి యూనివర్శిటీ తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనూ ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాల అంశం చర్చకు వచ్చింది. నాగపూర్‌లో గత వారం కురిసిన కుంభవృష్టితో నాగపూర్ లెజిస్లేచర్ కాంప్లెక్స్‌లోకి నీరు చేరడంపై విచారణకు సభ ఆదేశించింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంలో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు నాగపూర్‌లో జరుగుతాయి. ప్రస్తుత సమావేశాలను కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని, సోమవారం అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలను ప్రారంభమైన కొద్ది వ్యవధిలోనే వాయిదా వేశారు. కాగా, వర్షాకాల సమావేశాలను నాగపూర్‌లో నిర్వహించాలన్న నిర్ణయం ఎవరిదో తెలపాల్సిందిగా ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రశ్నించగా, సమావేశాలు వాయిదా పడడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాధాకృష్ణ విఖే పాటిల్ వ్యాఖ్యానించారు. నాగపూర్ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా మారిన వంతెనల వివరాలను తెలపాల్సిందిగా శివ సేన ఎమ్మెల్సీ నీలమ్ గోర్హే కోరారు.
ముంబయిలోని కుర్లా, సియాన్, దాదర్, మీరా రోడ్డు, నల్లసోపారా, వసాయ్ తదితర ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. రైల్వే ట్రాక్స్ పైనుంచి నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే పరిధిలో చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని లోకల్ ట్రైన్స్‌ను రద్దు చేశారు. గుజరాత్ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు బొరివలీ, విరార్, నల్లసోపారా స్టేషన్లలో నిలిచిపోయాయి. ట్రాక్స్‌ను క్లియర్ చేసిన తర్వాత అవి బయలుదేరాయి. రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులు కూడా ఆలస్యమవుతున్నాయి.

చిత్రం..భారీ వర్షాలకు జలమయమైన ముంబయి ప్రధాన వీధిలో నత్తనడకన నడుస్తున్న వాహనాలు.