జాతీయ వార్తలు

ఇచ్చినంటే ఇచ్చి.. గుంజుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశం మూలంగానే ఏపీలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం విడుదల చేసిన రూ.350కోట్లను రిజర్వ్ బ్యాంక్ తిరిగి తీసుకున్నదని తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయకుడు ఆరోపించారు. రామ్మోహన్ నాయుడు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఎలా ఉపసంహరించుకుంటారని నిలదీశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం ఉద్దేశించిన నిధులను మొదటి మూడేళ్లు సక్రమంగా ఇచ్చి నాలుగో సంవత్సరం నిధులు ఇచ్చినట్లే ఇచ్చి ఎలా వాపస్ తీసుకుంటారని రామ్మోహన్ నాయుడు ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించారు. ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం మూలంగానే రాష్ట్రానికి విడుదల చేసిన రూ.350 కోట్లను వారం రోజుల్లోనే వాపస్ తీసుకున్నారని, నిధుల ఉపసంహరణ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం లేదా అని ఆయన నిలదీశారు. విభజన చట్టం మేరకు ఇచ్చిన నిధులను ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఉపసంహరించుకుంటే తమ గొడవ ఎవరితో చెప్పుకోవాలని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్, ఒడిశా పద్ధతిలో ప్యాకేజీ ఇస్తామని మొదట హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ తరువాత జిల్లాకు యాభై కోట్ల రూపాయల చొప్పున ఇవ్వటం అన్యాయం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ నిధులను కూడా సక్రమంగా ఇవ్వరు.. ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఉపసంహరించుకుంటారని ఆయన ఆరోపణలు కురిపించారు. ఇదిలాఉంటే బీసీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు పోడియం వద్దకు వచ్చి పెద్దఎత్తున నినాదాలిస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. నిధులు వెంటనే విడుదల చేయాలి.. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని దెబ్బతీయకూడదంటూ పోడియం వద్ద నిలబడి పెద్దఎత్తున నినాదాలిచ్చారు. తెలుగుదేశం ఎంపీలు డిమాండ్లు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో చివాట్లు తిన్నారు. మీరిలా పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం ఎంతమాత్రం మంచిది కాదు.. గత వారమే మీరు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాను.. అయినా మీరిలా గొడవ చేయటం మంచిది కాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలుగుదేశం సభ్యులకు చివాట్లు పెట్టారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం సభ్యులు తమ సీట్లలో కూర్చుని ప్లకార్డులు ప్రదర్శించటానికి కూడా సుమిత్రా మహాజన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మీ సభ్యుడు మాట్లాడుతున్నా మీరు ప్లకార్డులు ప్రదర్శిస్తారా అని నిలదీస్తూ.. మీరిలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.