జాతీయ వార్తలు

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టం 1989లో పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని సుప్రీంకోర్టు సవరించిన నేపథ్యంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులతో రూపొందించిన బిల్లును లోక్‌సభలో గత శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన వేధింపుల నిరోధక చట్టాన్ని తక్షణం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, లేకుంటే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. సోమవారం ఈ విషయమై ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చేదిగా ఉందని వివిధ దళిత సంఘాలు విమర్శిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ప్రతిపాదనల ప్రకారం చట్ట సవరణ జరిగితే సమాజంలోని అట్టడువర్గాల వారికి అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని శక్తివిహీనంగా, నీరుగార్చే రీతిలో ఎలాంటి చర్యలకు పూనుకోరాదని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైతే సదరు నిందితుడిని అరెస్టు చేయడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు వీలుందని, ఒకవేళ ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సూచనల మేరకు మారిస్తే నిందితుడిని సులభంగా తప్పించేందుకు అవకాశం ఉంటుందని ఖార్గే అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు ఇటీవల కాలంలో 35 శాతం పెరిగినట్టు ఆయన చెప్పారు. ఈ పరిస్థితులను నివారించడానికి ప్రస్తుత చట్టానే్న పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.