జాతీయ వార్తలు

కరుణానిధి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 7: భారతదేశ రాజకీయాల్లో హిమశిఖర సమానుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత, ద్రవిడ సింహం ఎం. కరుణానిధి అస్తమించారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆయన ఇక్కడ కావేరీ ఆసుపత్రిలో వయోభారం, అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. 1957 నుంచి ఇంతవరకు 70 ఏళ్ల పాటు తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ, ఐదుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన కరుణానిధి ప్రజారంజకపాలన అందించి ప్రజల మన్ననలు పొందారు. తమిళ భాష, సంస్కృతి పరిరక్షణ, ద్రవిడ ఉద్యమమే ఊపిరిగా సామాజిక, సాహిత్య, సినీ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించడంతో తమిళనాడు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. 11 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యులు కరుణానిధికి మెరుగైన వైద్య చికిత్స అందించినా చివరకు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఏడు దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను తిరుగులేని విధంగా శాసించిన మహాయోధుడు, ద్రవిడ సంస్కృతి పరిరక్షణకు రాజీలేకుండా అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప నాయకుడు కరుణానిది. ఆయనకు ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. ఆయన భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజత్తి అమ్మాల్ ఉన్నారు. కుమారుల్లో డిఎంకె ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్, మరో కుమారుడు అళగిరి, కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కరుణానిధి ఆరోగ్యాన్ని కాపాడేందుకు 11 రోజులుగా ఆస్పత్రి వైద్యులు అత్యంతమెరుగైన చికిత్స అందించారని, కాని దురదృష్టవశాత్తు మరణించారని కావేరి ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ ప్రకటనలో తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం గత కొంతకాలంగా క్షీణిస్తుండడంతో, రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు చెన్నైలోని కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా చెన్నైతో పాటు రాష్టమ్రంతటా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో,
ఆసుపత్రి వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానుల్లో ఆందోళన పెరిగింది. సాయంత్రం 4 గంటల నుంచే ఆసుపత్రి వెలుపల, రాష్టమ్రంతటా పెద్ద ఎత్తున ప్రజలు సెంటర్లలో చేరి కరుణానిధి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఆసుపత్రి వద్ద ఉద్వేగభరితమైన సన్నివేశాలు కనపడ్డాయి. ఎజెంతు వా తాలవై అంటూ ( ఓ నాయకుడా త్వరగా కోలుకో) అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరుణానిధి మరణ వార్త విన్నవెంటనే ఒక్కసారి ఆ ప్రాంతంలో కొంత సేపునిశ్శబ్ధం ఏర్పడింది. ఆ తర్వాత అభిమానులు దుఃఖాన్ని ఆపుకోలేక రోదించారు. కరుణానిధి మరణించారన్న సమాచారం తెలిసిన వెంటనే చెన్నై, కోయంబత్తూరు, సేలం, మధురై తదితర నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో వర్తకులు స్వచ్చందంగా దుకాణాలు మూసివేశారు. అభిమానులు దుఃఖభారంతో హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా వౌలిక సదుపాయాల వ్యవస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. రాజకీయ ప్రత్యర్థి, ముఖ్యమంత్రి జె జయలలిత మరణించిన 20నెలలకు కరుణానిధి కన్నుమూశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీతో సయోధ్యగా ఉంటూ తమిళనాడు ప్రయోజనాల కోసం రాజీలేకుండా నిరంతరం శ్రమించారు. ద్రవిడ ఉద్యమ వ్యవస్థాకులు, హేతు వాది ఇవి రామస్వామి పెరియార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ద్రవిడ ఉద్యమంలో కరుణానిధి చేరారు. తొలి నాళ్లలో డిఎంకె వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి అన్నాదొరకు అనుంగు అనుచరులుగా ఉండేవారు. బ్రాహ్మణవాదం, హిందీ భాషను కేంద్రం బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కరుణానిధి నాస్తికుడు. అన్నాదొరై మరణించిన తర్వాత 1969లో ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 1971, 1989, 1996, 2006లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పరిపాలన రంగంలో సంస్కరణలు తెచ్చారు. రాష్ట్ర శాసనసభకు గత 70 ఏళ్లలో 13 సార్లు ఎన్నికయ్యారు. 2016లో 92 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కరుణానిధిని అభిమానులు ప్రేమగా తలైవార్ (నాయకుడు), కలైగ్నర్ ( కళాకారుడు) అని పిలిచేవారు. 1969లో డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ఆయన అధ్యక్ష హోదాలో కొనసాగారు. కరుణానిధి అంత్యక్రియల స్థలంపై తీవ్ర వివాదమే చెలరేగుతోంది. మెరీనా బీచ్‌లో స్థలాన్ని కేటాయంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయంచింది. కాగా కరుణానిధి మృతికి సంతాపంగా బుధవారం జాతీయ సంతాప దినంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.