జాతీయ వార్తలు

ఎన్డీయేదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ బలపరిచిన జేడీ(యూ) అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ ఇరవై ఓట్ల మెజారిటీతో రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హరివంశ్‌కు 125 ఓట్లు రాగా ప్రతిపక్షం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు లభించాయి. జర్నలిస్టుగా చాలాకాలం పనిచేసి రాజ్యసభకు 2014లో మొదటిసారి ఎంపికైన హరివంశ్ నారాయణ్ సింగ్ సభకు వచ్చిన రెండు సంవత్సరాల్లోనే డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావటం గమనార్హం. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన హరివంశ్ నారాయణ గతంలో ప్రధాన మంత్రి చంద్రశేఖర్‌కు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. సౌమ్యుడుగా ముద్రపడిన హరివంశ్ బిహార్‌లోని పీడిత ప్రజలు, వ్యవసాయదారుల ప్రయోజనాల పరిరక్షణకోసం ఎంతో కృషి చేశారు. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు గురువారం ఉదయం 11.30 గంటలకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. జేడీ(యూ), బీజేపీ, అకాలీదళ్ సభ్యులు హరివంశ్ నారాయణ సింగ్ పేరును సమర్థంచగా కాంగ్రెస్, టీఎంసీ పార్టీల సభ్యులు ప్రతిపక్షాల అభ్యర్థి హరిప్రసాద్ పేరును సమర్థించారు. వెంకయ్య నాయుడు మొదటిసారి పోలింగ్ జరిపించినప్పుడు హరివంశ్ నారాయణ్ సింగ్‌కు 115 ఓట్లు లభిస్తే హరిప్రసాద్‌కు 89 ఓట్లు లభించాయి. అయితే కొందరు సభ్యులు తమ ఓటు నమోదు కాలేదని ఫిర్యాదు చేయటంతో వెంకయ్య నాయుడు మరోసారి ఓటింగ్ ప్రక్రియను నిర్వహించవలసి వచ్చింది. రెండోసారి ఓటింగ్ ప్రక్రియ జరిపినప్పుడు హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అనుకూలంగా 122 ఓట్లు లభిస్తే హరిప్రసాద్‌కు 98 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇద్దరు సభ్యులు తటస్థంగా ఉండిపోయారు. అప్పుడు
కూడా తమ ఓటు నమోదు కాలేదని కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అలాంటివారి ఓట్లను స్లిప్పుల ద్వారా సేకరించారు. ఇది జరిగిన అనంతరం వెంకయ్య నాయుడు తుది ఫలితాలను ప్రకటిస్తూ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు 125 ఓట్లు లభిస్తే హరిప్రసాద్‌కు 105 ఓట్లు లభించినట్లు అధికారికంగా ప్రకటించారు. తదనంతరం ఆయన ఎన్‌డీఏ ఉమ్మడి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉండటం గురించి మాత్రం వెంకయ్యనాయుడు ప్రకటించలేదు. కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు ఎంఏ ఖాన్ వీల్‌చైర్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖాన్ నెలరోజుల క్రితం బాత్‌రూంలో జారి పడటంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశం మేరకు ఎంఏ ఖాన్ హైదరాబాద్ నుండి ఢిల్లీకి రాకతప్పలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఆయన గత అర్ధరాత్రి ఢిల్లీకి వచ్చారు. ఆయన గురువారం ఉదయం వీల్‌చైర్లో సభకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరో తెలుగు ఎంపీ టీ.సుబ్బిరామిరెడ్డి అనారోగ్యం కారణంగా ఓటింగ్‌కు హాజరు కాలేకపోయారు. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎంపీలు అసలు సభకే రాలేదు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికై హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, టీఆర్‌ఎస్ నాయకుడు కే కేశవరావు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తదితరులు అభినందించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరూ కూడా అధికారపక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ ఆకాంక్షించారు.
ఎన్డీయే అభ్యర్థికే టీఆర్‌ఎస్ ఓటు
టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు, బీజేడీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా ఓటువేయటంతో హరివంశ్ నారాయణ సింగ్ ఎంపిక అత్యంత సులభమైపోయింది. శివసేన కూడా ఆఖరు క్షణంలో తమ వైఖరి మార్చుకుని బీజేపీకి మద్దతు ప్రకటించటంతో హరివంశ్ నారాయణ్ సింగ్ ఇరవై ఓట్ల మెజారిటీ సాధించగలిగారు. హరిప్రసాద్‌కు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం, ఎస్పీ, బీఎస్పీ, జేడీ(ఎస్), వామపక్షాల సభ్యులు బలపరచగా, హరివంశ్ నారాయణ్ సింగ్‌కు బీజేపీ, అకాలీదళ్, టీఆర్‌ఎస్, అన్నా డీఎంకే, బీజేడీ, శివసేన పార్టీలు మద్దతిచ్చాయి.

చిత్రం..రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్