జాతీయ వార్తలు

ఎన్నికల హడావిడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్‌కుమార్‌తో సమావేశమై తెలంగాణ శాసన సభకు ఎన్నికల నిర్వహణ గురించి చర్చించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను వీలుంటే నవంబర్‌లోనే జరిపే విధంగా చర్చల సరళి ఉన్నదని చెబుతున్నారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియపై దృష్టి సారించారు. మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు డిసెంబర్‌లో జరుగనున్నందున తెలంగాణ శాసనసభ ఎన్నికలను నవంబర్‌లో జరిపేందుకు గల సాధ్యాసాధ్యాల గురించి లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, తుది జాబితా ఎప్పటిలోగా సిద్ధమవుతుంది, లోపాలను సరిదిద్దేందుకు ఎంత సమయం పడుతుందనే అంశంపై రజత్‌కుమార్ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. నవంబర్‌లో ఎన్నికలు జరిపే పక్షంలో భద్రతా దళాల మోహరింపు, ఎన్నికల సిబ్బందిని సిద్ధం
చేయటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి తమ వాదన వినిపించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు 2002లో ఇచ్చిన తీర్పు ప్రకారం రద్దయిన శాసనసభ ఎన్నికలను ప్రాధాన్యంపై చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి నవంబర్‌లోనే ఎన్నికలు జరిపేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. నవంబర్‌లో ఎన్నికలు జరిపే పక్షంలో ఏ తేదీల్లో జరుపవచ్చు.. డిసెంబర్‌లో అయితే ఏయే తేదీలు అనుకూలంగా ఉంటాయనేది పరిశీలించినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే పాఠశాలలు, కాలేజీల పరిస్థితి.. విద్యార్థుల పరీక్షలు తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం వాకబు చేసిందని అంటున్నారు. ఓటర్ల జాబితాను త్వరితగతిన రివైజ్ చేసేందుకు చర్యలు చేపట్టిన అంశాన్ని రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. వచ్చే నెల అక్టోబర్ 8నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారని అంటున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంల అందుబాటు, వీవీపాట్ల వినియోగం, సిబ్బంది సంసిద్దత, శాంతిభద్రతలపై తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
ఇలావుండగా శాసనసభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించాం.. అయితే ఎన్నికలు ఎప్పుడు జరపాలనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రజత్‌కుమార్ విలేఖరులకు చెప్పారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమీషనర్ ఉమేష్ సిన్హా నాయకత్వంలో ప్రత్యేక బృందం మంగళవారం హైదరాబాద్ వస్తోంది.. వీరి పర్యటన ముగిసిన అనంతరం ఎన్నికలు ఎప్పుడు జరపాలనేది నిర్ణయిస్తారని రజత్‌కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పినట్లు తెలిసింది.

చిత్రం..కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం వెలుపలకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్‌కుమార్