జాతీయ వార్తలు

కర్నాటకలో కంగుతిన్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: కర్నాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ నియోజకర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు బీజేపీని ఆందోళనలో పడవేశాయి. కర్నాటక ఉపఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నెలాఖరున జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ శాసనసభల ఎన్నికలతోపాటు ఆ తరువాత 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా పడుతుందని బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. కర్నాటకలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు బళ్లారి, శివమొగా, మాండ్యాకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఒకటి గెలిస్తే రెండు సీట్లను కాంగ్రెస్, జేడీ(ఎస్) గెలుచుకున్నాయి. రెండు శాసనసభ నియోజకవర్గాలు జమఖండి, రామానగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీ(ఎస్) చెరొకటి గెలుచుకున్నాయి. రెండు శాసనసభ నియోజకవర్గాలు గతంలో కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందినే కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలే గెలుచుకోవటం వలన బీజేపీకి పెద్దగా సమస్య లేదు. అయితే మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లోనే బీజేపీకి షాక్ తగిలింది. ఈ నియోజకవర్గాలు రెండు బీజేపీవి కాగా ఒకటి జేడీ(ఎస్)ది. ఉపఎన్నికల్లో
బీజేపీ శివమోగాను తక్కువ మెజారిటీతో నిలబెట్టుకోగా బళ్లారిని కాంగ్రెస్‌కు అప్పగించింది. శివమోగా లోక్‌సభ నియోజకవర్గంలో ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు ఉపఎన్నికలో ఆయన కుమారుడు రాఘవేంద్ర గెలిచారు. అయితే 2014 ఎన్నికలో యెడ్యూరప్ప ఈ నియోజకవర్గం నుండి దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తే ఇప్పుడు ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర కేవలం యాభై ఒక్కవేల మెజారిటీతో గెలిచారు. రాఘవేంద్ర మెజారిటీ బాగా పడిపోవటం చూస్తుంటే యెడ్యూరప్ప, బీజేపీ ప్రభావం బాగా తగ్గిపోయిందనే అభిప్రాయం కలుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే లోకసభ ఎన్నికల్లో శివమోగాను నిలబెట్టుకోవటం కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ నుండి జారిపోయి కాంగ్రెస్‌కు దక్కటం బీజేపీ నాయకుల ఆందోళనను మరింత పెంచుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బి.శ్రీరాములు భారీ మెజారిటీతో గెలువగా, ఇప్పుడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప బీజేపీ అభ్యర్థి జె.శాంతను దాదాపు రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. మాండ్య లోక్‌సభ సీటును జేడీ(ఎస్) నిలబెట్టుకున్నది.
కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమికి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తోడైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలోని మెజారిటీ లోక్‌సభ సీట్లను గెలుచుకోగలుగుతామా? అనే అనుమానం బీజేపీ నాయకులకు పట్టుకున్నది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటకలోని మొత్తం 28 సీట్ల నుండి పదిహేడు సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ తొమ్మిది, జేడీ(ఎస్) రెండు సీట్లు దక్కించుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి 28 నుండి 20 సీట్లు గెలుచుకుంటుందంటూ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన ప్రకటన బీజేపీ నాయకులను ఆలోచనలో పడవేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్నాటక ఉపఎన్నికల ఫలితాలను విశే్లషించిన అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిసింది. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు ఇప్పటినుండే బీజేపీ ప్రయత్నాలు ప్రారంభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చిత్రం..శివమొగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి బీవై రాఘవేంద్ర