జాతీయ వార్తలు

పేరు మార్పుపై భిన్నభిప్రాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైజాబాద్, నవంబర్ 11: ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చాలన్న నిర్ణయంపై భిద్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి స్థానికుల్లో అనేకులు ఈ విషయంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయమని, ఇందువల్ల చారిత్రాత్మకమైన ఈ పట్టణం గుర్తింపు కోల్పోతుందని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐతే మరోవర్గం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సాగతిస్తోంది. పురాణ కాలంనాటి అయోధ్య ప్రాశస్థ్యాన్ని ప్రతిబించడమే కాకుండా పట్టణ ప్రఖ్యాతి కూడా పెరుగుతుందని అభిప్రాయపడుతోంది. ఇలావుండగా ఈ పేరు మార్పు విషయం గుర్తుచేయగానే డెబ్బై నాలుగేళ్ల ఆయుర్వేద డాక్టర్ వౌర్య ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇప్పుడా అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయాలను దృష్టిలో వుంచుకుని తీసుకున్న నిర్ణయంలా ఉందని ఆయన అన్నారు. ఇందువల్ల తలెత్తే తికమక వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఇక్కడి ఘంటా ఘర్ (క్లాక్ టవర్) వద్దగల తన డిస్పెన్సరీ చిరునామాను కూడా తాను మార్చుకోనని ఈ వృద్ధ వైద్యుడు తెగేసి చెబుతున్నారు. అయోధ్యకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ జంటనగరాల్లో ఒకటైన ఫైజాబాద్ ఉంది. అక్కడే అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉంది. కాగా అలహాబాద్‌ను ప్రయాగగా మార్చినట్టే త్వరలో ఫైజాబాద్ జిల్లా పేరును సైతం అయోధ్య జిల్లాగా మార్చడం జరుగుతుందని ఈనెల 6న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి వేడుకల సందర్భంగా అయోధ్యలోని రాం కథాపార్కులో ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించడం జరిగింది. అధికార బీజేపీ కార్యకర్తలు, సంఘ్‌పరివార్ శ్రేణులు సైతం యోగి ఆదిత్యనాథ్ ప్రకటనకు వంతపలికాయి. ఈ ఉత్సవానికి హాజరైన దీపక్‌పాండే (18) మాట్లాడుతూ ఫైజాబాద్ జిల్లా పేరుమార్పు తనకెంతో ఆనందంగా ఉందని, ఇది ఎంతో అవసరమని అన్నారు. అలాగే అయోధ్యలోని శతాబ్ధాల చారిత్రక హనుమాన్ గార్తీ ఆలయంలోని ప్రధాన అర్చకుల్లో ఒకరైన శశికాంత్ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ణయం సహేతుకమైనదని అన్నారు. ఈ పౌరాణిక పట్టణానికి ఇందువల్ల మరింత విశిష్టత, ప్రఖ్యాతి కలుగుతాయన్నారు. కాగా అయోధ్యలో స్థానిక పత్రికలో పనిచేసే జర్నలిస్టు స్కంద్‌దాస్ ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి జిల్లా కేంద్రానికి వస్తుంటారు. జిల్లా పేరుమారిస్తే వీరంతా తికమకకు గురవుతారని అన్నారు. అలాగే అయోథ్యలోని వివాదాస్పద రామజన్మ భూమికి సమీపంలో రెండు శతాబ్ధాల నాటి ఓ ఇంట్లో నివసించే గోస్వామి అనేవ్యక్తి మాట్లాడుతూ అయోధ్య ప్రఖ్యాత పుణ్యక్షేత్రమే అయినప్పటికీ జిల్లా పేరును మార్చడం తగదని, ఇది కేవలం రాజకీయ నిర్ణయంగా భావించాల్సి వస్తోందని అన్నారు. అలాగే పాన్‌షాప్ యజమాని రజియుద్దీన్, అల్త్ఫా కురేషీ అనే రిక్షా కార్మికుడు సైతం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఫజియాబాద్‌కు ప్రత్యేక చరిత్ర ఉందని, నవాబులు నిర్మించిన గులాబ్ బారీ, మోతీ మహల్, బహుబేగం కా మక్బారా వంటి ప్రముఖ దర్శనీయ స్థలాలున్నాయని పేరు మార్పువల్ల వీటి విశిష్టత కోల్పోయే అవకాశాలున్నాయని అన్నారు.