జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి కుష్వాహా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి) అధ్యక్షుడు, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహా సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కేవలం రబ్బర్ స్టాంపుల స్థాయికి దిగజార్చారని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా బిహార్‌లోని వెనుకబడిన కులాల వారిని మోసగించారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒకరోజు ముందు ఆయన తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను కాంగ్రెస్, లాలూప్రసాద్‌కు చెందిన ఆర్‌జెడీ పార్టీలతో ఉన్న విపక్ష కూటమిలో చేరనున్నట్టు ఆయన వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బిహార్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెల్చుకోదని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మోదీకి సమర్పించిన రాజీనామా లేఖలో ఆయనపై పలు విమర్శలు గుప్పించారు. పేదల కోసం పనిచేసే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని అన్నారు. ముఖ్యంగా వెనుకబడిన కులాల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించారని, వారికి సామాజిక న్యాయమన్నదే కరవైందని అన్నారు. 2015లో బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆర్‌ఎస్‌ఎస్ అజెండా ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలావుండగా బిహార్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌ఎస్‌పి మూడు స్థానాల్లో పోటీ చేయగా, వచ్చే 2019 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామని బీజేపీ ప్రతిపాదించడం ఆ పార్టీ అధ్యక్షుడు కుష్వాహాను తీవ్ర నిరాశ పరిచింది. ప్రస్తుతం ఆ పార్టీకి రెండు ఎంపీలు, రెండు ఎమ్మెల్యే స్థానాలుండగా, వచ్చే ఎన్నికల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని జెడి (యు), తాము సమాన సీట్లలో పోటీ చేస్తామని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించిన విషయం విదితమే. తమ పార్టీ ప్రాధాన్యతను తగ్గించిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారన్న ఊహాగానాలు ఇటీవల వెల్లువెత్తాయి. దానిని నిజం చేస్తూ ఆయన సోమవారం తన పదవికి రాజీనామ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ, నితీష్‌కుమార్ వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోదని కుష్వాహా విలేఖరుల సమావేశంలో చెప్పడం విశేషం.
చిత్రం..కుష్వాహా