జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్ పీఠంపై కమలనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, డిసెంబర్ 17: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా 72 సంవత్సరాల కమలనాథ్ సోమవారం పదవీస్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అనంది బెన్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తొమ్మిదిసార్లు లోక్‌సభకు చింద్వారా నుంచి ఎన్నికైన కమలనాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎంపిక కావడం, ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా నేడు కమలనాథ్ ఒక్కరే ప్రమాణం చేశారు. ఆయన కేబినెట్‌లో ఎవరు చేరుతారు, ఎంతమందికి స్థానం లభిస్తుందన్నది స్పష్టం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కమలనాథ్ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. పదవీ స్వీకార ప్రమాణానికి ముందు సర్వమత ప్రార్థనలు జరిగాయి. ప్రఖ్యాత డూన్ స్కూల్‌లో చదువుకున్న కమలనాథ్ కోల్‌కతాలోని సెయింట్ జేవియర్‌లో డిగ్రీ తీసుకున్నారు. నిజానికి ఏప్రిల్‌లో అసెంబ్లీకి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కమలనాథ్ పేరును కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నాడు ప్రధాని ఇందిరాగాంధీతో అత్యంత సన్నిహితుడిగా కమలనాథ్ మెసిలారు. కమలనాథ్ తన మూడో కుమారిడిగా ఇందిరాగాంధీ 1979లో ప్రకటించిన విషయాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అతిరథ మహారథులు గుర్తు చేసుకున్నారు. నాడు మొరార్జీదేశాయ్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ఇందిరాగాంధీకి కమలనాథ్ ఎంతో చేయూతనిచ్చారు. 16వ లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడిగా ఉన్న కమలనాథ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకభూమిక పోషించారు.
2003 నుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుని ఉన్న బీజేపీని గద్దె దించడంలోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని సాధించడంతో పాటు ఇతర పార్టీల మద్దతును సమకూర్చడంలోనూ కమలనాథ్ గురుతర భూమిక పోషించారు. కమలనాథ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మక రీతిలోనే ప్రచారం సాగించి అంతిమంగా విజయాన్ని సంతరించుకోగలిగారు. 230 స్థానాలు కలిగిన ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 సీట్లున్నాయి. సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్ బలం 121కు పెరిగింది. బీజేపీ బలం 109 సీట్లు కావడం గమనార్హం.
మాఫీపై మాట నిలబెట్టుకున్నారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే రైతుల రుణమాఫీ ఫైలుపై కమలనాథ్ తొలి సంతకం చేశారు. రెండు లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కమలనాథ్ తొలిసంతకం ఈఫైలుపైనే జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి సంతకం చేయడం రుణమాఫీకి సంబంధించిన ఉత్తర్వులు చకచకా జరిగిపోయాయి. జాతీయ బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి రెండు లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి.
చిత్రం..కమల్‌నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అభివాదం చేస్తున్న
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ నాయకులు జ్యోతిరాదిత్య సింథియా