జాతీయ వార్తలు

పార్లమెంట్ కంటే.. మా పాఠశాలే నయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ‘మీ పార్లమెంటు కంటే మా పాఠశాల బాగా పనిచేస్తోంది.. పార్లమెంటుకు ఏమైంది.. సభ్యులు ఎందుకిలా గొడవ చేస్తున్నారు’ అని పలువురు తనను ప్రశ్నిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ గొడవ చేస్తున్న ప్రతిపక్షం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ- ‘పార్లమెంటు ఉన్నది చర్చించేందుకే తప్ప ఇలా గొడవ చేసేందుకు కాదని.. ప్రతిరోజూ మీరిలా గొడవ చేయటం వలన ప్రజలకు తప్పుడు సందేశం వెళుతుందని.. ఇది మంచి పద్ధతి కాదు’ అని పలుమార్లు హెచ్చరించారు. మీరు లేవనెత్తుతున్న సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. మీరు మీ సీట్లలోకి వెళితే చర్చ ప్రారంభించవచ్చునని ప్రతిపక్షం సభ్యులకు సూచించారు. పార్లమెంటు సక్రమంగా పని చేయకపోవటంపై విదేశాల నుండి సైతం విమర్శలు వస్తున్నాయి.. మీ పార్లమెంటుకు, మీ దేశానికి ఏమైందని అడుగుతున్నారని సుమిత్రా మహాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు నియమ నిబంధనల మేరకు ఏ అంశంపైనైనా చర్చ జరపవచ్చు.. చర్చకు నోటీసులు ఇవ్వవచ్చునని అన్నారు. ‘మీ పార్లమెంటు కంటే మా పాఠశాల బాగా పని చేస్తోంది’ అని సందేశాలు వస్తున్నాయంటే మనం దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామనేది సభ్యులు ఆలోచించాలని వారికి హితవు చెప్పారు. మనల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని ఇక్కడికి పంపించారు.. మనపై గురుతర బాధ్యతలున్నాయి.. అయినా మీరిలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసం అని ఎంపీలను ప్రశ్నించారు. మనకున్న బాధ్యతలో కొద్దిగైనా నిర్వహించలేమా అని ప్రశ్నించారు. పోడియం వద్దకు వచ్చి గొడవ చేసే బదులు ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చ జరిపితే బాగుంటుందని చేతులెత్తి నమస్కారం చేస్తూ విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడేందుకు ప్రయత్నించగా- ‘కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద గొడవ చేస్తుంటే మీరెలా మాట్లాడుతారు? మీరు మాట్లాడాలంటే మొదట మీ సభ్యులను సీట్లలోకి వెళ్లమనండి’ అని సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. దీనితో కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోగానే మల్లికార్జున ఖర్గేకు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా అధికార పక్షం సభ్యులు జేపీసీని వేయడం కుదరదంటూ నినాదాలివ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ప్రతిపక్షం ప్రతిపాదించే ప్రతి అంశంపైనా సభలో చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా రాఫెల్ వ్యవహారంపై జేపీసీని నియమించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. జేపీసీ ఏర్పాటు తన అధికార పరిధిలోని అంశం కాదని సుమిత్రా మహాజన్ చెప్పారు. దీనితో కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి పెద్దఎత్తున గొడవ చేసి సభను స్తంభింపజేశారు. దీనితో సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు.