జాతీయ వార్తలు

భద్రతా సంస్థలకు కమ్యూనికేషన్ హక్కులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ భద్రత పేరుతో ప్రజల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనపై నిఘా పెట్టే అధికారాన్ని పది భద్రతా సంస్థలకు ఇవ్వడాన్ని ప్రతిపక్ష పార్టీలు నిరసించాయి. ఈ విషయంలో శుక్రవారం రాజ్యసభలో అధికార, ప్రతిపక్షం సభ్యుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఎంతకూ సద్దుమణగకపోవడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తోందని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ ఆరోపించారు. కాగా, రాజ్యసభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ, దేశ భద్రతను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ప్రత్యాపరోపణ చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలనే ఎన్‌డీఏ ప్రభుత్వం ఇప్పుడు పొడిగించిందే తప్ప కొత్త చట్టాన్ని చేయడం లేదని స్పష్టం చేశారు. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేచి కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను దెబ్బ తీస్తోందని మండిపడ్డారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ మాత్రం కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనలపై నిఘా పెట్టే అధికారాన్ని పది భద్రతా సంస్థలకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల గురించి పదేపదే ప్రస్తావించారు. ప్రజల ప్రాథమిక హక్కులను కేంద్ర సర్కారు హరిస్తోందని, ప్రజల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టటం ద్వారా పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తోందని వారు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జైట్లీ అన్నారు. కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఆదేశాలు జారీ అయ్యాయని జైట్లీ గుర్తుచేశారు. తాము కొత్తగా ఆదేశాలు జారీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. దేశ భద్రత కోసం ఈ ఆదేశాలు ఎంతో అవసరమని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని, చివరకు దేశ భద్రతను కూడా రాజకీయం చేస్తున్నాయని జైట్లీ ధ్వజమెత్తారు. కీలక పదవుల్లో ఉన్న గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ ఆరోపణ చేసే ముందు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని క్షుణ్ణంగా చదివితే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇది కొత్త ఆదేశం కాదని, పాత ఆదేశాన్ని పొడగించవలసి వచ్చిందని ఆయన పదేపదే చెప్పుకొచ్చారు. అయితే, జైట్లీ ఇచ్చిన సమాధానం నచ్చని కాంగ్రెస్ ఎంపీలు తమ సీట్లలో నిలబడి గొడవ చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం దేశ ప్రజల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరిస్తోందంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ సింగ్ ఇరుపక్షాలకు సర్ది చెప్పేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. గొడవ మూలంగా ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగడం లేదని ఆయన అన్నారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను మానకపోవడంతో ఆయన సభను ఈనెల 27 తేదీ ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యసభ అంతకు ముందు కూడా ప్రతిపక్షం గొడవ మూలంగా ఒకసారి వాయిదా పడింది.
లోక్‌సభలోనే అదే తీరు..
రాజ్యసభలోనేగాక, లోక్‌సభలోనూ అదే తీరు కొనసాగింది. అధికార, ప్రతిపక్షం చేసిన గొడవ మూలంగా సభ శుక్రవారం, తొమ్మిదో రోజు కూడా పెద్దగా పని చేయకుండానే ఈనెల 27 తేదీకి వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షం సభ్యులు చేసిన గొడవ మూలంగా సభ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగింది. కాంగ్రెస్, అన్నా డీఎంకే, తెలుగుదేశం సభ్యులు పోడియం వద్దకు, వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కర్నాటక ప్రభుత్వం చేపట్టిన మేకదాటు నీటిపారుదలు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపవేయాలని అన్నా డీఎంకే వాదించగా, తెలుగుదేశం సభ్యులు ఆంధ్రద్రేశ్‌కు ప్రత్యేక హోదా ఆవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. బీజేపీ సభ్యులు తమ సీట్లలో నిలబడి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ గందరగోళం మధ్య ఒక ప్రశ్నపై కొంత సేపు చర్చ జరిపారు. అయితే అధికార, ప్రతి పక్షం సభ్యుల గొడవ మూలంగా కార్యకలాపాలు స్తంభించిపోవటంతో ఆమె సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సుమిత్రా మహాజన్ మొదట అధికార పత్రాలను సభకు సమర్పింప జేశారు. ఆమె ఆ తరువాత జీరో అవర్‌లో ముగ్గురు సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ఇది జరుగుతున్నంత సేపూ అధికార, ప్రతిపక్షం సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈదీనితో సుమిత్రా మహాజన్ లోకసభను ఈనెల 27 తేదీ ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.