జాతీయ వార్తలు

ఎన్నికల తరువాతే..కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 22: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తమ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ ముగింపు సందర్భంగా విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన నాయకుడే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. ఇటీవల కరుణానిధి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ వ్యతిరేక కూటమిలోని కీలక రాజకీయ పక్షం డీఎంకే అధినేత స్టాలిన్ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కూటమిని ఏకతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్న చంద్రబాబు వాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, అత్యంత దురహంకార ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్న ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ సహా అన్ని బీజేపీయేతర పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో రెండు జాతీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికల పోరులో జాతీయ పార్టీ కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీల గొడుగు లేకుండా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేస్తున్నది వృధాప్రయాసగా కొట్టిపడేశారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన తరువాత వ్యవస్థల నిర్వీర్యం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని జొప్పించారన్నారు. తమకు వ్యతిరేకంగా ఉండే వారిపై ఈ వ్యవస్థలను ఉసిగొల్పుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాజాగా వ్యక్తిగత సమాచార భద్రతను సైతం తమ గుప్పిట పెట్టుకునేందుకు కొత్తగా చట్టం తెస్తున్నారన్నారు. దీన్ని సమర్ధించుకునేందుకు గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానే్న తాము అమలు చేస్తున్నామంటూ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దుతో ఎవరైనా సంతోషించారా అంటూ ప్రశ్నించారు. రూ.500, రూ.1000 రద్దు చేసిన ప్రభుత్వం అవినీతికి పరాకాష్ఠగా రూ.2000 నోట్లను తెచ్చిందన్నారు. దీన్ని తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానన్నారు. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశాన్ని నిరోధించడం ద్వారా అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మా పార్టీ ఎంపీలు, సానుభూతి పరులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నాయి, బీజేపీలో అటువంటి వ్యాపారస్తులపై ఎందుకు దాడులు జరగట్లేదని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుని కుమారుడిపై కూడా ఆరోపణలున్నాయని గుర్తు చేశారు. రాజకీయ అవసరాల కోసమే 2014లో తాము బీజేపీతో కలసి పోటీచేయాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని అనివార్యతలు ఉంటాయని, అందులో భాగంగానే విభజనతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు బీజేపీతో కలిసి పనిచేశామన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిగా 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసినా కనికరం చూపలేదన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రంతో పోరాడేందుకు సిద్ధపడ్డామన్నారు. రాజకీయ పార్టీలకు కొన్ని అనివార్యతలు ఉంటాయని, తమిళనాడు ప్రాంతీయ పార్టీ డీఎంకే కేంద్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టినా భాగస్వామ్యం కావడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. 1989లో పీవీ నసింహారావు ప్రభుత్వం మైనార్టీలో ఉండి కూడా పలు సంస్కరణలు తీసుకురాగలిగిందని, మోదీ సర్కారు మెజార్టీతో ఏమీ సాధించకుండా చతికిలబడిందని ఎద్దేవా చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తరువాత పరిణామాల నేపథ్యంలో ఎన్‌డీఏ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. దీని తరువాత మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు పాలించిందన్నారు. గత నాలుగున్నరేళ్లుగా దేశంలో వ్యవస్థల విచ్ఛిన్నం సాగుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ సహా పలు పార్టీలు కూటమి కట్టాయన్నారు. ఎనికల్లో విచ్చలవిడిగా డబ్బు పారించి గెలవాల్సిన అవసరం తనకు లేదని, నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ధిని వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు.