జాతీయ వార్తలు

20వేల కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించేందుకు బైసన్‌పోలో మైదానాన్ని కేటాయించాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 20వేల కోట్లు ఇవ్వాలని, విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను ఒక కాల పరిమితిలో పూర్తిచేయాలని, షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను వీలున్నంత త్వరగా వర్గీకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నివాసంలో నరేంద్ర మోదీతో దాదాపు గంటా పదిహేను నిమిషాలపాటు చర్చలు జరిపారు. తెలంగాణకు సంబంధించిన పదహారు అంశాలతో కూడిన ఒక వినతిపత్రాన్ని ఆయన ప్రధాన మంత్రికి అందజేసి వీటిని వీలున్నత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రశేఖరరావును నరేంద్ర మోదీ అభినందించటంతోపాటు ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి అందుబాటులో ఉండే విధంగా నిర్మించాలనుకుంటున్న కొత్త సచివాలయం కోసం బైసన్ పోలో మైదానాన్ని వెంటనే కేటాయించాలని చంద్రశేఖరరావు ప్రధాన మంత్రిని కోరారు. సచివాలయం నిర్మాణంతోపాటు స్థానిక రోడ్ల విస్తరణకు ఈ మైదానం ఎంతో అవసరమని ఆయన వివరించారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీని నిర్మించాలని, హైదరాబాదులో ఐఐఎం, సైన్స్, ఎడ్యుకేషన్ పరిశోధనా సంస్థ (ఐఐఎస్‌ఈఆర్)ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు సాగునీటిని పంపిణీ చేసే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 20వేల కోట్ల రూపాయలను గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రతిపాదించిన విధంగా ఎన్‌హెచ్‌ఏఐ సంయుక్త రంగంలో అదిలాబాద్‌లోని సీసీఐని పునరుద్ధరించాలని విన్నవించారు. జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక జోన్ (ఎన్‌ఐఎంజడ్)ను ఏర్పాటు చేయాలని, వరంగల్‌లో వెయ్యి కోట్ల రూపాయలతో కాకతీయ మెగా జౌళి పార్క్‌ను అభివృద్ధి చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చంద్రశేఖరరావు ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్లను కృష్ణానదీ జల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌కు పంపించాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన రూ.450కోట్ల ఆఖరు విడత నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

చిత్రం..ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్