జాతీయ వార్తలు

తొలి మెట్టెక్కిన తలాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సవరించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఇకమీదట ట్రిపుల్ తలాక్ ఇచ్చే భర్తలకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లు ఆమోదంకోసం రాజ్యసభకు వెళుతుంది. అనంతరం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పరిశీలనకు, ఆయన ఆమోదముద్ర పడగానే చట్ట రూపం దాలుస్తుంది. బిల్లుకు 245 మంది సభ్యులు మద్దతివ్వగా, కేవలం పదకొండు మంది మాత్రమే వ్యతిరేకించారు. బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపించేందుకు కేంద్రం నిరాకరించింది. అందుకు నిరసనగా కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా సభనుండి వాకౌట్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించిన నాలుగు సవరణలు ఓటింగ్‌లో వీగిపోయాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును గురువారం చర్చకు స్వీకరించి, ఐదు గంటలపాటు సుదీర్ఘంగా
చర్చ జరిపి ఆమోదించారు. సవరించిన బిల్లులో ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన ఫిర్యాదును బాధిత భార్య లేదా ఆమె రక్త సంబంధీకులు మాత్రమే చేసేందుకు వీలు కల్పించారు. పాత బిల్లులో పొరుగువారు, చుట్టుపక్కలవారు కూడా ఫిర్యాదు చేసేందుకు వీలుండేది. దీనివలన చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందంటూ ప్రతిపక్షం అభ్యంతరం తెలపడంతో ఈ సవరణ చేశారు. ట్రిపుల్ తలాక్ అనంతరం ఇరుపక్షాలు చర్చలద్వారా సర్దుబాటు చేసుకునేందుకు కూడా ఇందులో వీలు కల్పించారు. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన పక్షంలో బాధిత భార్యకు ఎంత భరణం ఇవ్వాలనేది నిర్ణయించే అధికారాన్ని న్యాయమూర్తికి ఇచ్చారు. ఇదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తకు బెయిల్ ఇచ్చే అధికారాన్ని పోలీసుల నుండి తొలగించి కేసును విచారిస్తున్న న్యాయమూర్తి పరిధిలోకి తెచ్చారు. అయితే బాధిత భార్య వాదన విన్న తరువాతనే తలాక్ ఇచ్చిన భర్తకు బెయిల్ ఇచ్చే విధంగా సవరణ చేశారు.
బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించలేదు కానీ.. తలాక్ ఇచ్చే భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే నియమాన్ని తొలగించాలని వాదించారు. తలాక్ ఇచ్చిన భర్తకు శిక్ష పడటం వల్ల భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య సర్దుబాటుకు ఎలాంటి అవకాశం ఉండదు.. దీనితోపాటు జైలులోన్న భర్త తలాక్ ఇచ్చిన భార్యకు భరణం ఎలా చెల్లించగలుగుతాడని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ వ్యవహారం సామాజిక సమస్య అని.. దీనిని క్రిమినల్ చర్యగా చేయటం రాజ్యాంగ విరుద్ధమని వారు వాదించారు. కేంద్ర ప్రభుత్వం మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వాదించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్, అన్నాడీఎంకే డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌ను ఆమోదించలేదు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆర్‌ఎస్పీ సభ్యుడు ప్రేమచంద్రన్ వాదించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అభ్యంతరాలకు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. మతపరమైన ప్రభుత్వాలున్న ముస్లిం దేశాల్లో ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమైనప్పడు లౌకికదేశమైన భారత్‌లో దీనిని ఎలా కొనసాగిస్తారని రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్షాన్ని నిలదీశారు. చివరకు పాకిస్తాన్ కూడా ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని ఆలోచిస్తోందని, భారతదేశంలో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించగానే పాకిస్తాన్ కూడా ఇదేదారిలో ముందుకు సాగనున్నదని ఆయన చెప్పారు. ఇస్లామ్‌లో లేని ట్రిపుల్ తలాక్.. ఇస్లామిక్ చట్టం షరియత్‌లోకి ఎలా వచ్చిందని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆయన సభకు వివరించారు. ట్రిపుల్ తలాక్ రద్దు విషయంలో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని రవిశంకర్ చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని.. వివిధ సమాజాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్, ఎంఐఎం తదితర ప్రతిపక్ష పార్టీలు చేసిన వాదనలను రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. ముస్లిం మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసమే తామీ బిల్లు ప్రతిపాదించాంతప్ప ఓట్లకోసం కాదని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. రక్షణ శాఖ మంత్రి మహిళ.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహిళ.. లోక్‌సభ స్పీకర్ మహిళ.. కేంద్ర మంత్రివర్గంలో పలువురు మహిళలు ఉన్నారని.. మహిళల హక్కుల పరిరక్షణ లక్ష్యంతోనే తామీ బిల్లు తెచ్చాంతప్ప మరో లక్ష్యంతో కాదని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26కు వ్యతిరేకమంటూ ప్రతిపక్షం సభ్యులు చేసిన వాదనలను రవిశంకర్ ప్రసాద్ కొట్టివేశారు. తమ ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదని, ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షించటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ ఇచ్చే భర్తలకు మూడేళ్ల శిక్ష విధించటం మంచిది కాదని ప్రతిపక్షం వాదిస్తోంది.. అయితే మనదేశంలో వరకట్న చట్టం, ఇతర పలు చట్టాల్లో భర్తలు, అత్తలు, ఇతర బంధువులకు శిక్షలు పడుతున్నాయి.. ఈ శిక్షలకు అభ్యంతరం తెలపని ప్రతిపక్షం కేవలం ట్రిపుల్ తలాక్‌లో భర్తలకు శిక్ష పడటాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి.. దీని వెనక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు తెచ్చిన ఈ బిల్లును సమర్థించాలంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. రవిశంకర్ ప్రసాద్ సమాధానం ముగిసిన అనంతరం బిల్లుపై ఓటింగ్ జరిపి ఆమోదం తెలిపారు.
చిత్రాలు.. త్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. *ఓటింగ్ అనంతరం సభ ఆమోదం తెలుపుతున్న డిస్‌ప్లే బోర్డు.