జాతీయ వార్తలు

కర్నాటకలో బీజేపీ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ కర్నాటకలో కాంగ్రెస్ శాసన సభ్యులను కొగొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కుట్ర చేస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
మల్లికార్జున ఖర్గే బుధవారం ఏఐసీసీలో విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ బలవంతగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, తమ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశచూపుతున్నారని విమర్శించారు. డబ్బులకు లొంగకపోతే భయపెడుతున్నారని ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఐటీ, ఈడీ దాడులు చేయిస్తామని భయాందోళనలకు గురిచేస్తున్నారని బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. అవసరమైతే సీబీఐని ప్రయోగించి అరెస్టులు చేయిస్తామని బెదిరిస్తున్నట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా ఫలించవని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు తమ శాసన సభ్యులను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌కు స్టార్ హోటల్‌లో ఎందుకు బంధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్రాంతికి రాజకీయ విప్లవం వస్తుందని చెప్పిన కమలనాథులు కాంగ్రెస్ శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైందని ఖర్గే ఎద్దేవా చేశారు. శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించటం ఇది మొదటిసారి కాదని, యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడూ కూడా ఇలా జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు. ‘కాంగ్రెస్ శాసన సభ్యులు పార్టీ ఫిరాయించటం లేదు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తున్నారు’అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు చెందిన పది మంది శాసన సభ్యులు తమ వద్ద ఉన్నారంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుల్లో గందరగోళం సృష్టించేందుకు ఇలాంటి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. ఇలాంటి కుట్రలకు భయపడవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి, కర్నాటక ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తనతో చెప్పారన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పరస్పరం చర్చించుకుంటూ సమర్ధవంతం పాలన అందిస్తున్నాయని అన్నారు.
అసలు బీజేపీ తమ శాసన సభ్యులను గుర్గావ్‌లో ఎందుకు దాచాల్సి వచ్చిందీ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసే కుట్రలను మానుకోవాలని బీజేపీకి ఆయన సలహా ఇచ్చారు.
‘కుతంత్రాలు బయటపెడతాం’
కర్నాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న బీజేపీ ఎత్తులు ఫలించవని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. బీజేపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారన్న సీఎం త్వరలోనే వారి కుతంత్రాలు బయటపడతాయని తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పటిష్టంగా ఉందని లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసే పోటీచేస్తాయని బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నందున ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతోందని మంగళవారం వార్తలు హల్‌చల్ చేశాయి.
అలాగే ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రధాని మోదీతో అత్యవసర భేటీ అవుతారన్న కథనాలు వెలువడ్డాయి. దీనిపై కుమారస్వామి మాట్లాడుతూ ‘ మా ప్రభుత్వానికి ఢోకాలేదు. చక్కగా పనిచేస్తోంది. కాంగ్రెస్ మంత్రులెవరూ రాజీనామా చేయడం లేదు’అని ఇక్కడ స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ లేదా జేడీఎస్ మంత్రులు ఎవరూ రాజీనామా చేయరు అని ఆయన తెలిపారు. కార్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, గుర్గావ్‌లో ఎమ్మెల్యేలను బంధించి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే