జాతీయ వార్తలు

గుండె రగిలిపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరౌనీ (బీహార్), ఫిబ్రవరి 17: భారత జవాన్లపై పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థ జరిపిన అమానుష దాడి వరుసగా మూడోరోజు కూడా యావద్భారతాన్ని రగిలిస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్న మాటలే ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలకు అద్దం పట్టాయి. ‘ఆవేదన, ఆగ్రహంతో నా గుండె రగిలిపోతోంది. పుల్వామాలో 40 మంది భారత జవాన్లు మిలిటెంట్ దాడిలో మరణించడంపై మీ గుండెల్లో ఎలాంటి మంటలు రగులుతున్నాయో.. అంతగానూ నా హృదయం ఉడికిపోతోంది’ అని మోదీ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉత్తర బీహార్‌లో అభివృద్ధి పనులకు ఆయన ఆదివారం ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవానులకు నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘ఈ దాడిలో వీరమరణం పొందిన సంజయ్‌కుమార్ సిన్హా, రతన్‌కుమార్ ఠాకూర్‌లకు వందనం చేస్తున్నా’ అని అన్నారు. పాట్నా, భాగల్పూరు జిల్లాలకు చెందిన ఈ అమరులిద్దరి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. రూ.33వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసిన ఆయన ఆ ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవితాల్లో వచ్చే అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. మీరు రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందునే
ఈ అభివృద్ధి సాధ్యపడింది.. ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వేగవంతమైన నిర్ణయాల వల్ల ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. పేద రైతులకు ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం గురించి మాట్లాడుతూ ఇది వారి జీవితాల్లో అనూహ్య మార్పును తీసుకువస్తుందని అన్నారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల కల్పనతో ఆయావర్గాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, ఈ అదనపు కోటా వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. బీహార్ మొదటి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సిన్హా సూచనల మేరకు బెగుసరాయ్-బారౌని ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. పుల్వామా దాడిపై భారత్ తగువిధంగా బుద్ధి చెబుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ, గవర్నర్ లాల్‌జీ టాండన్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రామ్‌విలాస్ పాశ్వాన్, రామ్‌కృపాల్ యాదవ్, గిరిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. బీహార్‌లోని బెగుసరాయ్‌లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ