జాతీయ వార్తలు

తమిళనాట పొత్తు పొడుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ‘ఔర్ ఏక్‌బార్ మోదీ సర్కార్’ (మరోసారి మోదీ సర్కార్) అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ అధినాయకత్వం తమ లక్ష్య సాధన కోసం రాష్ట్రాల్లో పొత్తుల పరంపర కొనసాగిస్తోంది. సోమవారం మహారాష్టల్రో శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ మంగళవారం తమిళనాడులోని అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. ప్రతిపక్షాలతో పోలిస్తే పొత్తుల విషయంలో బీజేపీ వేగంగా ముందుకుపోతోంది. మహారాష్టల్రో శివసేనతో సీట్ల సర్దుబాటు చేసుకోవటం ద్వారా బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారు దొంగ) అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదాన్ని అందిపుచ్చుకున్న శివసేన ఇప్పుడు యూ-టర్న్ తీసుకుని బీజేపీతో లోక్‌సభ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చేసుకున్నది. మహారాష్టల్రోని మొత్తం 48 లోక్‌సభ సీట్లలో బీజేపీ 25 స్థానాల్లో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సీట్ల సర్దుబాటు గురించి సోమవారం ప్రకటించడం తెలిసిందే. మరో ఐదు నెలల్లో జరిగే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన సమాన సీట్లలో పోటీ చేస్తాయి. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపట్టాలనేది తర్వాత నిర్ణయిస్తారు. బీజేపీ-శివసేన కూటమి 48 లోక్‌సభ సీట్లలో 45 స్థానాలను గెలుచుకుంటుందని అమిత్ షా ప్రకటించటం గమనార్హం. బీజేపీ, శివసేన మధ్య గత నాలుగేళ్లుగా ‘పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చందంగా’ విమర్శలు చేసుకోవడం తెలిసిందే. అలాంటి పార్టీలు ఇప్పుడు సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్టల్రో సీట్ల సర్దుబాటు చేసుకున్న బీజేపీ మంగళవారం తమిళనాడులో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఐదు సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క సీటు గెలుచుకోవటం తెలిసిందే. బీజేపీకి ఐదు సీట్లు కేటాయించిన అన్నాడీఎంకే ఎస్.రామదాస్ నాయకత్వంలోని పీఎంకేకు ఏడు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా సీట్లలో అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య సీట్ల సర్దుబాటు జరిగిందని బీజేపీ కోశాధికారి, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం చెన్నైలో ప్రకటించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటే.. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎదుర్కొనేందుకు అంగీకారం కుదిరిందని గోయల్ వివరించారు. 21 శాసనసభ స్థానాలకు జరగవలసిన ఉప ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. పాండిచ్చేరి లోక్‌సభ సీటును బీజేపీకి కేటాయించేందుకు అన్నాడీఎంకే అంగీకరించిందని గోయల్ చెప్పారు. తమిళనాడులో తమ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇంతకుముందే బీజేపీ బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ)తో సీట్ల సర్దుబాటు చేసుకోవటం తెలిసిందే.

చిత్రం.. అన్నాడీఎంకేతో చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. చిత్రంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం