జాతీయ వార్తలు

రక్షణ విషయంలో రాజకీయాలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 21:‘దేశ రక్షణ విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ రాజకీయాలకు తావుండకూడదు. ముఖ్యంగా రక్షణ విషయంలో రాజీపడకుండా రాజకీయాలు చేసే దృక్పధాన్ని పార్టీలు అలవర్చుకోవాలి.’ అని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హితవు పలికారు. గురువారం నెల్లూరుజిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రైల్వే మంత్రి పీయూష్‌గోయల్, సామాజిక న్యాయ శాఖ మంత్రి తెహర్‌చంద్ గెహ్లాట్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ పనిచేస్తే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో అభివృద్ధినే ప్రధాన అంశంగా పేర్కొంటూ రూపకల్పన చేసుకోవాలని సూచించారు. ఏమి చేస్తున్నామో, ఏమి చేయబోతున్నామో, ఏమి చేయగలమో ప్రజలకు వివరించి ప్రజలను ఆలోచన చేసుకోనివ్వాలని కోరారు. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
దేశంలో 100 రైల్వేస్టేషన్లను మోడల్ స్టేషన్లుగా రూపొందించాలని ప్రణాళిక సిద్ధం చేసి తొలి విడతగా 10 స్టేషన్లలో పనులు చేయాలని నిర్ణయించారని, అందులోనూ తొలుత దేశంలోనే నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఈ పనులు ప్రారంభం కానుండడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. నెల్లూరుతో పాటు తిరుపతి స్టేషన్ కూడా మోడల్ స్టేషన్‌గా అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో పునర్నిర్మించబోతున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణపట్నం- ఓబులవారిపల్లి రైల్వే లైను వలన నెల్లూరు-రాయలసీమ ప్రాంతాల మధ్య అనుసంధానం జరిగిందని, భవిష్యత్తులో ఈ లైను సరుకు రవాణాలో దేశంలోనే అగ్రగామి లైనుగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు విమాన, రైలు, రహదారి అనుసంధాన మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనును కూడా త్వరలో జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఎన్నో ఆనందకర క్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు, రాష్ట్రం కోసం రాజ్యసభలో తాను పోరాడిన క్షణం, స్మార్ట్ సిటీలకు రూపకల్పన చేయడం, పోలవరం కోసం తెలంగాణాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం, రేరా బిల్లును ఆమోదింపచేయడం.. ఇలా కొన్ని సందర్భాలు తన జీవితంలో ఎంతో మధురక్షణాలని గుర్తు చేసుకున్నారు.
దేశంలోనే తొలి మోడల్
రైల్వేస్టేషన్ : పీయూష్ గోయల్
దేశంలోనే తొలి మోడల్ రైల్వేస్టేషన్‌గా నెల్లూరు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, ఇందుకోసం రూ.147కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలను నెల్లూరు నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రైవేటు నెట్‌వర్క్‌ల కన్నా రైల్వేటెల్ నెట్‌స్పీడ్ ఎంతో వేగంగా ఉంటుందని భరోసానిచ్చారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమ రైల్వే శాఖ ఎంతో ముందుందన్నారు. పూర్తిస్థాయి బయో టాయిలెట్‌లను అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పూర్తి యంత్రాలతో టాయిలెట్లను శుభ్రం చేయిస్తున్నామని వెల్లడించారు. అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని, తర్వాత రైళ్లలోనూ సీసీ టీవీలు ఏర్పాటు చేసి స్వచ్ఛతను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అయితే ఇందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తున్న కృష్ణపట్నం- ఓబులవారిపల్లి రైల్వేలైనులో ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీలోగా పాసింజర్ రైళ్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దేశంలో కాపలాదారుడు లేని రైల్వేగేటులు లేకుండా చేశామన్నారు. 2009-14 మధ్య నిత్యం దేశంలో కేవలం 8 కి.మీ. మేర కొత్త రైల్వే నిర్మాణం జరుగుతుండగా, తాము అధికారంలోకి వచ్చాక నిత్యం 290కి.మీ. కొత్త రైల్వేలైను నిర్మాణం జరుగుతోందన్నారు. గూడూరు-విజయవాడల నడుమ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం గూడూరు ఏరియాలో జరగుతున్న పనులు పూర్తయిన వెంటనే ఈ రైలు సర్వీసు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
పలు రైళ్ల పొడిగింపు, నిలుపుదల
రాష్ట్రానికి సంబంధించి పలు రైలు సర్వీసులను పొడిగిస్తూ, మరికొన్ని స్టేషన్లలో కొత్త రైళ్లను నిలుపుదల చేస్తున్నట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు. విజయవాడ - ధర్మవరం (17215-16) ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం వారానికి మూడు రోజులు నడుస్తుండగా ఇకపై ప్రతిరోజూ ఈ సర్వీసు ఉంటుందన్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019-20)కు పిఠాపురంలో హాల్ట్ ఇచ్చామన్నారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 24 నుండి రాజంపేటలో నిలుపుదల చేస్తామన్నారు. హౌరా-విజయవాడల నడుమ వారానికొకసారి తిరిగే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఇకపై తిరుపతి వరకూ పొడిగించారు. కటక్-బరంపూర్ (68433-34) మెము రైలు మార్చి 3 నుండి ఇచ్చాపురం వరకు, విశాఖ -పలాస (58526-25) పాసింజర్ బరంపూర్ వరకు, మిర్యాలగూడ-కాచిగూడ (77673-74) ప్యాసింజర్ శుక్రవారం నుండి నడికుడి వరకూ పొడిగించామన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రైల్వే మంత్రి పీయూష్‌గోయల్, సామాజిక న్యాయ శాఖ మంత్రి తహర్‌చంద్ గెహ్లాట్‌ల చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.
తొలుత నెల్లూరు నగరంలో ఎఫ్ ఎం రేడియో స్టేషన్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. రైల్వేకు సంబంధించి బిట్రగుంట-చెన్నై ఫాస్ట్ మెము రైలును రైల్వే మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, నెల్లూరు, గూడూరు, తిరుపతి స్టేషన్లలో హైస్పీడ్ వై ఫై, జిల్లాలోని వెంకటాచలంలో కేంద్ర దివ్యాంగుల శిక్షణా కేంద్రం, కృష్ణపట్నం- ఓబులాయపల్లి రైల్వేలైను జాతికి అంకితం, అక్కంపేట స్టేషన్‌లో నూతన బుకింగ్ కార్యాలయం, తమిళనాడు రాష్ట్రం గుమ్మడిపూడిలో కొత్త సబ్‌వే ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాజీ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర రైల్వేశాఖ మంత్రి గోయల్ తదితరులు