జాతీయ వార్తలు

కొత్తచోట్లా పాగా వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 24: ఇప్పటివరకు తమ పార్టీకి అంతగా ఉనికి లేని రాష్ట్రాల్లో సైతం ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చూపించి దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వ్యక్తం చేశారు. కర్నాటక బీజేపీ అధ్యక్షుడు కూడా అయిన ఆయన పీటీఐతో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో సైతం తమకు గతంలో కంటే అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్-కర్నాటక ప్రాంతంలో బీజేపీ మంచి పట్టును సాధించిందని, అలాగే ముంబయి-కర్నాటక, సెంట్రల్ కర్నాటక ప్రాంతాల్లో సైతం బలపడిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఈసారి 20 నుంచి 22 సీట్లను గెల్చుకుంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే పూర్తి కుమ్ములాటలతో మునిగిపోయి ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఈ ఎన్నికల తర్వాత కుప్పకూలడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
దేశమంతటా బీజేపీ పవనాలు వీస్తున్నాయని, ఈసారి పశ్చిమబెంగాల్, ఒడిసా, ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో కంటే అధికసీట్లు సాధిస్తామన్న నమ్మకం ఏర్పడిందని యెడ్యూరప్ప పేర్కొన్నారు. అందుకే ఈసారి తాము దేశవ్యాప్తంగా 300కు పైగా సీట్లను గెల్చుకుంటామన్న ధీమా ఏర్పడిందన్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. కేరళ రాష్ట్రంలో ఈ ఎన్నికలతో బోణీ కొట్టనున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారం కోల్పోయినా వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదని, కర్నాటకలో జేడీ (ఎస్) ప్రాబల్యం అధికంగా ఉండే తూముకూరు, మైసూరు, రామనగర, హాసన్‌లలో ఈసారి తమ పార్టీ పాగా వేస్తుందని యెడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాన మద్దతుదారులైన మల్లికయ్య, గుత్తేదార్, ఉమేష్ జాదవ్, బాబురావు, మాలక రెడ్డి తదితరులు ఆయనతో విభేదించి బీజేపీలో చేరారని, ఈసారి ఆయనకు హైదరాబాద్-కర్నాటకలో ఇబ్బంది తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కర్నాటకలో పోటీ చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కర్నాటక పీసీసీ అధ్యక్షుడు గుండూరావు కోరడంపై ఆయన స్పందిస్తూ అమేథీలో పోటీ చేయాలా వద్ద అనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం డోలాయమాన స్థితిలో ఉందని, గత ఎన్నికల్లో 50 శాతం తేడాతో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీపై విజయం సాధించిన రాహుల్‌కు ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అర్థమైందని, అందుకే ఆయన ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆ సీటును వదిలేస్తారని తాను భావిస్తున్నట్టు యెడ్యూరప్ప తెలిపారు. ఒకవేళ ఆయన కర్నాటకలో పోటీ చేసినా, ఇక్కడ సైతం ఆయన విజయం అంత సులభం కాదని అన్నారు.

చిత్రం..కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప