జాతీయ వార్తలు

సవాళ్లకు దీటుగా వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, డిసెంబర్ 1: భారత వ్యవసాయ రంగం అన్ని రకాల సవాళ్లను తట్టుకుని వినూత్న రీతిలో ఉత్పత్తులను పెంచుకోవడానికి కారణం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమనుతాము తీర్చిదిద్దుకోవడమేనని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు సంబంధిత ఇతర ఉత్పత్తులను కూడా పెంచుతూ భారత్‌ను ప్రధాన ఎగుమతి దేశంగా మార్చిన ఘనత రైతులదేనని కితాబిచ్చారు. సిఐఐ ఆగ్రోటెక్ ఇండియా 13వ సదస్సును శనివారంనాడిక్కడ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కోవింద్ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడంలో భారత రైతు అసాధారణ ప్రజ్ఞాపాటవాలు, ధైర్యసాహసాలను కనబరిచాడని అన్నారు. ఇతర దేశాలకు చెందిన 37 మంది ప్రతినిధులు సహా మొత్తం 195మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. తమకు రుణమాఫీ చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ దేశం నలుమూలల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీలో భారీ ప్రదర్శన జరపడం, వారికి కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. తమ అవస్థలను చాటిచెబుతూ గురు, శుక్రవారాల్లో రైతులు పార్లమెంట్‌కు ప్రదర్శనగా వెళ్లేందుకూ ప్రయత్నించిన విషయం తెలిసిందే. కాగా, వ్యవసాయ మార్కెట్లను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీని వల్ల రైతులకు మరింతగా గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని రాష్టప్రతి ఈ సదస్సులో వెల్లడించారు. ప్రధాన మంత్రి కృషి సించాల్ యోజన, ప్రధాన మంత్రి ఫసర్ బీమా యోజన వంటి కేంద్ర పథకాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఇవన్నీ కూడా దేశంలో రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించినవేనని ఉద్ఘాటించారు. పది లక్షల హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యాన్ని అందిస్తున్నామని, అలాగే 25మిలియన్ మంది రైతులకు ప్రయోజనం కలిగించే రీతిలో పంట బీమా పథకాన్నీ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. పత్తి వంటి వాణిజ్య పంటలను కూడా మన రైతు ప్రపంచానికి అందిస్తున్నాడని పేర్కొన్న రాష్టప్రతి వీటి ఉత్పత్తుల పరిమాణాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, వాతావరణ మార్పుల నుంచి రక్షణ, ధరల్లో హెచ్చుతగ్గుల నుంచి రైతులకు ఉపశమనం కలిగించాలని, అలాగే వ్యవసాయ రంగంలోకి నిలకడతో కూడిన పెట్టుబడులనూ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అన్నారు. ఇవన్నీ సమకూరితే వ్యవసాయానికి మరింత విలువ చేకూరడమే కాకుండా ఎలాంటి పోటీనైనా తట్టుకుని మరింతగా రాణించగలుగుతుందని రాష్టప్రతి ఉద్ఘాటించారు. అలాగే రైతుల ఆదాయం కూడా గణనీయంగా ఇనుమడించేందుకు ఈ చర్యలు అనేక విధాలుగా దోహదం చేస్తాయని చెప్పారు.