జాతీయ వార్తలు

అమలు చేసి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యలో ఆకాశాన్ని తాకే రామమందిర నిర్మాణాన్ని మూడు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎవరెంత గొడవ చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘మీరెంత గొడవ చేసినా పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆగదు’ అని ఆయన ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ రాష్ట్ర శాఖ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం మూడు ముస్లిం దేశాల నుండి మతహింస మూలంగా వలసవచ్చిన హిందువులు తదితర ఆరు మతాల వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది తప్ప దేశంలోని పౌరుల పౌరసత్వం రద్దు చేసేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు. తామీ వాస్తవాన్ని పలుమార్లు చెప్పినా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం మానడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పౌరసత్వ సవరణ చట్టం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పౌరసత్వం కల్పించే
చట్టాన్ని పౌరసత్వాన్ని రద్దు చేసే చట్టంగా ప్రచారం చేయడం దారుణమని ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తనతో బహిరంగ వేదికపై చర్చకు వస్తారా అని ఆయన ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పౌరసత్వ సవరణ చట్టం గురించి బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని అమిత్ షా ప్రకటించారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా? అని ఆయన ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం మూలంగా కాంగ్రెస్‌కు అంధత్వం వచ్చిందని ఆయన విమర్శలు గుప్పించారు. మతం ఆధారంగా దేశాన్ని విభజించిన కాంగ్రెస్ ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. మతం ఆధారంగా దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌లో 23 శాతం మంది, బాంగ్లాదేశ్‌లో 30 శాతం మంది హిందువులు, సిక్కులు, బౌద్ధులు ఉండేవారని, ఇప్పుడు ఈ దేశాల్లో మూడు శాతం, ఏడు శాతం మాత్రమే మిగిలారని, మిగతా హిందువులు, సిక్కులు, బౌద్ధులు ఏమయ్యారని అమిత్ షా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని తానీ ప్రశ్న అడుగుతున్నానని, ఇందుకు తగిన జవాబు చెప్పగలరా? అని అమిత్ షా నిలదీశారు. కాగా, ఢిల్లీలోని జేఎన్‌యూలో జనవరి ఐదో తేదీనాడు జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ భారతదేశాన్ని వెయ్యి ముక్కలు చేస్తామన్న వారందరినీ జైలుకు పంపిస్తామని హోం శాఖ మంత్రి ప్రకటించారు. దేశాన్ని వెయ్యి ముక్కలు చేస్తామనే వారిని జైలుకు పంపించాలా? వద్దా? అని ఆయన ర్యాలీలో పాల్గొన్న వారిని ప్రశ్నించగా వారంతా పంపాల్సిందేనని ముక్తకంఠంతో బదులిచ్చారు.

'చిత్రం...కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా