జాతీయ వార్తలు

వేదసారం పంచిన శ్రద్ధానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు కాదు చేతలతోనే మార్పు సాధ్యం
అంటరానితనం పురాణాల్లో లేదు
ఆర్‌ఎస్‌ఎస్ సహ కార్యవాహ్ కృష్ణగోపాల్ ఉద్ఘాటన
వేద విద్య వ్యాప్తికి శ్రద్ధానంద నిరుపమాన కృషి
‘అసలీ మహాత్మా’ పుస్తక ఆవిష్కర్త రాజేంద్ర జిజ్ఞాసు
నిజమైన మహాత్ములకు దర్పణమే ఈ పుస్తకం
పుస్తకావిష్కరణ సభలో ఎంవిఆర్ శాస్ర్తీ

న్యూఢిల్లీ, నవంబర్ 27: అంటరానితనం మంచిది కాదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బదులు దళితులు, బడుగు, బలహీన వర్గాల వారికి సమాజంలో సముచిత స్థానం ఇవ్వటం ద్వారా హిందూమతాన్ని సంస్కరించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ కార్యవాహ్ కృష్ణగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలోని కాన్సిస్ట్యూషనల్ క్లబ్ లో జరిగిన ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ స్వామి శ్రద్ధానంద జీవి త విశేషాలతో రాసిన ‘అసలీ మహా త్మా’ హిందీ అనువాద గ్రంథం ఆవిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా పా ల్గొన్న కృష్ణగోపాల్ మాట్లాడుతూ వేదాలు, పురాణాల్లో ఎక్కడా అంటరానితనం లేదని స్పష్టం చేశారు. హిందూమతంలోని అంటరానితనాన్ని తొలగించేందుకు, వేదాలను ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు స్వామి శ్రద్ధానంద్ ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. ‘అంటరానితనం మంచిది కాదంటాం కానీ మన రోడ్లను పరిశుభ్రంగా ఊడ్చే పారిశుద్ధ్య కార్మికులను ఎప్పుడైనా ఇంటికి పిలిచి భోజనం పెడతామా? మనలో లోపలి నుండి మార్పు రావాలి, అప్పుడే సమాజం కూడా మారుతుంద’ని కృష్ణగోపాల్ హితవు పలికారు. హిందూమత రక్షణ కోసం స్వామి శ్రద్ధానంద చేసిన సేవ, కృషిని ప్రజలకు తెలియజేసేందుకు ఎంవిఆర్ శాస్ర్తీ ‘అసలీ మహాత్మా’ పుస్తకం ఎంతో తోడ్పడుతుందని ప్రశంసించారు. ‘మన పూర్వీకులను విమర్శించటం అర్థరహితం. కొన్ని సమయాల్లో కొన్ని నియమాలు ఏర్పరచటం అవసరమవుతాయి. కాలక్రమంలో ఆ నియమాలను మార్చుకోవలసి ఉంటుంద’ని ఆయన సూచించారు. ఈ గ్రంథాన్ని అవిష్కరించిన ప్రొఫెసర్ రాజేంద్ర జిజ్ఞాసు మాట్లాడుతూ స్వామి శ్రద్ధానంద జీవితంపై శాస్ర్తీ రాసిన పుస్తకం ఎంతో బాగున్నందంటూ అభినందించారు. హిందుమత పరిరక్షణ, వేదవిద్య వ్యాప్తి కోసం స్వామి శ్రద్ధానంద ఎంతో కృషి చేశారన్నారు. సూఫీ సిద్ధాంతం మూలంగా హిందూ మతానికి ప్రమాదం ముంచుకు వస్తోందని జిజ్ఞాసు హెచ్చరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు తరుణ్‌విజయ్ మాట్లాడుతూ ‘అసలీ మహాత్మా’ పుస్తకం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఇది దేశంలోని అన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాల్లో ఉండాల్సిన గ్రంథమని ఆయన అన్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో దీన్ని పాఠ్య పుస్తకం చేయాలని తరుణ్‌విజయ్ డిమాండ్ చేశారు. ఉత్తరాదికి చెందిన స్వామి శ్రద్ధానందపై దక్షిణాదికి చెందిన ఒక తెలుగువాడు ఇంత మంచి పుస్తకం రాయటం చాలా గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. గురు తేజ్‌బహదూర్, స్వామిశ్రద్ధానందల మూలంగానే భారతదేశంలో హిందూమతం ఇంకా మిగిలి ఉన్నదని అన్నారు. వివిధ కారణాల మూలంగా ఇతర మతాలలోకి వెళ్లిన వారిని హిందూ మతంలోకి తిరిగి ఆహ్వానించేందుకు శుద్ధి ఉద్యమాన్ని పెద్దయెత్తున జరపవలసిన తరుణం ఆసన్నమైందని ఆయన పిలుపు ఇచ్చారు. స్వామి శ్రద్ధానంద స్వాతంత్య్రానికి పూర్వమే శుద్ధి ఉద్యమం నిర్వహించి ఇతర మతాలలోకి వెళ్లిన వేలాది హిందువులను వెనక్కి తెచ్చిన అంశాన్ని ఎంవిఆర్ శాస్ర్తీ కళ్లకు కట్టినట్లు వివరించారని ఆయన చెప్పారు.
మహాత్మా అనే పదానికి నిజమైన అర్హుడు స్వామి శ్రద్ధానంద అని రచయిత ఎంవిఆర్ శాస్ర్తీ తెలిపారు. మహాత్మా గాంధీ స్వయంగా స్వామి శ్రద్ధానందను మహాత్మా అని సంబోధించారని చెప్పారు. హిందూమతంలోని లోపాలను సరిదిద్దటంతోపాటు వేదవిద్యను ప్రజల వద్దకు తీసుకుపోయిన మహానుభావుడు శ్రద్ధానంద అని శాస్ర్తీ తెలిపారు. ఇస్లాం మతం పుచ్చుకున్న వారిని తిరిగి హిందూమతంలో చేర్చేందుకు స్వామి శ్రద్ధానంద ఎంతో కృషి చేసినందుకే ఒక ఛాందస ముస్లిం ఆయనను కాల్చి చంపాడని శాస్ర్తీ చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం స్వామి చేసిన సేవల గురించి ఎవరికీ తెలియదన్నారు. హిందూమత పరిరక్షణ కోసం శ్రద్ధానంద చేసిన సేవలు వెలుగులోకి రాకుండా కుట్ర జరిగిందన్నారు. ఒక కుట్ర ప్రకారం కొందరు అయోగ్యులను మహాత్ములుగా చేసి పెట్టారని శాస్ర్తీ దుయ్యబట్టారు. దానివల్ల శ్రద్ధానంద లాంటి నిజమైన మహాత్ములు కనుమరుగయ్యారని ఆయన విమర్శించారు. నిజమైన మహాత్ములను వెలుగులోకి తెచ్చేందుకే తానీ పుస్తకం రాశానన్నారు. ‘కొందరు చరిత్రను వక్రీకరించారు, ఈ వక్రీకరణను బయటపెట్టేందుకే ‘అసలు మహాత్ముడు’ పుస్తకాన్ని తెలుగులో రాశాను... ఇప్పుడు దీని హిందీ అనువాదాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేశాన’ని ఆయన వివరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్లమెంటు సభ్యుడు సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ స్వామి శ్రద్ధానంద హిందూమతం పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్ముడని ప్రశంసించారు. గురుకుల విద్యావిధానం ద్వారా వైదిక మతవ్యాప్తికి శ్రద్ధానంద కృషి చేశారని ఆయన తెలిపారు. స్వామి ప్రారంభించిన శుద్ధి ఉద్యమం గాంధీజీకి నచ్చలేదన్నారు. స్వామి శుద్ధి ఉద్యమం మూలంగానే ఇతర మతాలలోకి వెళ్లిన వేలాది మంది తిరిగి హిందూమతంలోకి వచ్చారని ఆయన చెప్పారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా రచయిత ఎంవిఆర్ శాస్ర్తీని కృష్ణ గోపాల్ శాలువ కప్పి సత్కరించారు. వైఎస్‌ఆర్‌సిపి లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డితోపాటు పలువురు ఎంపిలు, మాజీ ఎంపిలు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చరిత్రకు జరిగిన చారిత్రక అన్యాయం
‘అసలీ మహాత్మా’ ఆవిష్కరణ సభలో ఎంవిఆర్ శాస్ర్తీ
చేసిన ప్రసంగపాఠం ‘సాహితి’లో

చిత్రం... ఆదివారం ఢిల్లీలో జరిగిన అసలీ మహాత్మా పుస్తకావిష్కరణ సందర్భంగా ఆంధ్రభూమి ఎడిటర్ ఎం.వి.ఆర్ శాస్ర్తీ, ప్రొ.రాజేంద్ర జిజ్ఞాసు, ఆర్‌ఎస్‌ఎస్ సహ కార్యవాహ్ కృష్ణగోపాల్,
డా. సత్యపాల్ సింగ్, మాజీ ఎంపి తరుణ్ విజయ్ తదితరులు