జాతీయ వార్తలు

చట్టం ద్వారానే సామాజిక మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: చట్టం ప్రాతిపదికపై పని చేయటం ద్వారానే సామాజిక మార్పు, పరివర్తనను సాధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ‘వ్యవస్థలో జరిగే మార్పులు చట్టం ప్రకారం జరగాలి. సహేతుకంగా ఉండాలి’ అని మోదీ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ శనివారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రసంగించారు. ‘చట్టం సర్వోన్నతం. మన దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ఇటీవల బాబ్రీ మసీదు, రామజన్మ భూమి అయోధ్య భూ వివాదంపై ఇచ్చిన తీర్పు గురించి మరోక్షంగా ప్రస్తావిస్తూ ‘తీర్పుకు ముందు ఈ అంశంపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగింది. చివరకు దేశ ప్రజలు కోర్టు ఇచ్చిన తీర్పును హృదయ పూర్వకంగా ఆమోదించారు’అని ప్రధాని అన్నారు. సుప్రీం కోర్టు పట్ల ప్రజలకు విశ్వాసం ఉందనేందుకు ఇదొక నిదర్శనమని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఈ మూడు వ్యవస్థలు ఒకరి పాత్రను మరొకరు గౌరవించుకుంటూ రాజ్యాంగం మూల సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవటం గర్వంగా ఉందని ప్రధాని ప్రకటించారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం సత్యం, సేవలకు అంకితమయ్యాయంటూ న్యాయ వ్యవస్థ పునాదులు కూడా సత్యం, సేవలేనని ప్రధాన మంత్రి తెలిపారు. పర్యావరణ న్యాయ మీమాంసను పునర్‌నిర్వచించినందుకు మోదీ సుప్రీం కోర్టును అభినందించారు. అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతూకం సాధించటం ద్వారా న్యాయ వ్యవస్థ ఈ లక్ష్యాన్ని సాధించగలగటం ముదావహమని ఆయన అన్నారు. సత్వరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఎంత మాత్రం సాధ్యం కాదని చాలా మంది భావించారని,
అయితే సుప్రీం కోర్టు ఈ రెండింటి మధ్య సమతూకం సాధించటం ద్వారా సత్వరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణనను సుసాధ్యం చేసిందని ఆయన ప్రశంసించారు. భారత దేశం సత్వరాభివృద్ధి సాధించటంతోపాటు అటవీ సంపదను పెంచుకోవటం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సత్వర న్యాయం, న్యాయ వ్యవస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉయోగించుకుంటోందన్నారు. దేశంలోని అన్ని కోర్టులను ఈ-కోర్టు ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టుతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధా ని వెల్లడించారు. జాతీయ న్యాయ వ్యవస్థ సమాచార (డేటా) గ్రిడ్ కోర్టుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఇంత వరకు 1, 500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసిందని ఆయన అన్నారు. దీంతోపాటు ట్రాన్స్‌జండర్ (లింగమార్పిడి) ప్రజల హక్కుల పరిరక్షణ చట్టం, ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం వంటి కొత్త చట్టాలను చేశామని నరేంద్ర మోదీ తెలిపారు. లింగ వివక్ష రూపుమాపకుండామకుండా ప్రపంచంలోని ఏ దేశం, సమాజం కూడా సమ్మిళిత అభివృద్ధి సాధించామని చెప్పలేవన్న ప్రధాని ‘ లింగ న్యాయం చేయగలిగితేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని నిరూపించాం’అని స్పష్టం చేశారు.
హక్కులకంటే బాధ్యతలు ముఖ్యం
హక్కుల కంటే విధులు ముఖ్యమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే స్పష్టం చేశారు. దేశ ప్రజలు తమ ప్రాథమిక విధులను మరిచిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విధులే హక్కులను నిర్ణయిస్తాయనేది మరిచిపోరాదని ఆయన తన అధ్యక్షోపన్యాసంలో స్పష్టం చేశారు. రాజ్యాంగం ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థను సృష్టించింది, దీనిని యథాతథంగా ఉంచేందుకు దేశం ఎంతో కృషి చేసిందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. భారత దేశం విభిన్న సంస్కృతుల మేళవింపు, సుదూర తీరాల నుంచి వచ్చిన సంస్కృతులను సైతం తనలో ఇముడ్చుకుందని బాబ్డే స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో అసమ్మతితోపాటు జనాకర్షణ కూడా ఎంతో ముఖ్యం అయితే జనాకర్షణ రాజ్యాంగం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే సమస్యగా మారుతుందని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. పరిపాలనను ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులకు వదిలివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు, అవినీతికి పాల్పడే ప్రజలకు గోప్యతా హక్కు ఉండదన్నారు. ఉగ్రవాదులు, అవినీతిపరులకు వ్యవస్థను దుర్వినియోగపరిచే అవకాశం ఇవ్వకూడదని ఆయన చెప్పారు.
*చిత్రం... ఢిల్లీలో శనివారం జరిగిన అంతర్జాతీయ న్యాయ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ