జాతీయ వార్తలు

రణరంగంగా ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: హింసాత్మక సంఘటనలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోయింది. వరుసగా మూడో రోజు మంగళవారం విచ్చల విడిగా దహనాలు, రాళ్ల దాడులు సాగాయి. సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణల్లో పది మంది మరణించారు. సోమవారం నాడు ఓ హెడ్‌కానిస్టేబుల్ సీఏఏ ఘర్షణల్లో మృతి చెందాడు. పలువురు పోలీసు అధికారులపైన నిరసనకారులు దాడులు చేసి గాయపరించారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఆందోళనలు రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈశాన్య ఢిల్లీలో షాపులు, వాహనాల దహనాలతో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. అల్లరి మూకలు గోకుల్‌పురిలో రెండు అగ్నిమాపక వాహనాలను ధ్వంసం చేశారు. వౌజ్‌పూర్‌లోని నిరసనకారుల గుంపులు వచ్చి భూకంప కేంద్ర వద్ద ఓ వాహనానికి నిప్పుపెట్టారు.
అనేక ప్రాంతాల్లోని వీధులన్నీ రాళ్లు, ఇటుకలు, టైర్ల దహనం సన్నివేశాలతో కనిపించాయి. హింస పేట్రేగి పోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏడుగురు మృతి చెందగా 150 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 48 మంది పోలీసులూ గాయపడ్డారని చెప్పారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం స్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్, పలువురు సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కల్లోల ప్రాంతాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి స్థానికులను భాగస్వాములను చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి కొన్ని దశాబ్దాలే అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పరిస్థితి ఇంత తీవ్రంగా లేదు. అల్లరి మూకలు, సాయుధ గుంపులు కర్రలు, రాళ్లు, రాడ్లు చేబూని వీధుల్లో వీరవిహారం చేశారు. ఎలాంటి జంకూ లేకుండా స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఈ- రిక్షాలతో సహా పలు వాహనాలను బుగ్గిచేశారు. వార్త సేకరణకు వెళ్లిన విలేఖరులను వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాఠశాలను తెరుచుకోలేదు. వీధుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో స్థానికులు ఇళ్లల్లోంచి బయటకు రావడానికి భయపడ్డారు. అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ నిరసకారులు ఉల్లంఘించారు. ‘పోలీసులు మోహరించినా అల్లరి మూకలు భయపడలేదు. వీధుల్లో రెచ్చిపోయి పౌరులపై దాడులకు దిగారు. షాపులను ధ్వంసం చేశారు. దగ్ధం చేశారు. శాంతి భద్రతలు క్షీణించాయి. ఇళ్లలో ఉన్నా రక్షణ లేని పరిస్థితి’అని వౌజ్‌పూర్ వాసి ఆందోళన వ్యక్తం చేశాడు. మరొకాయన మాట్లాడుతూ ‘35 ఏళ్ల తరువాత అంటే 1984నాటి సిక్కుల ఊచకోత ఘటన తరువాత ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతం రణరంగంగా మారిపోయింది’అని ఆవేదన చెందాడు.
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణల్లో 48 మంది పోలీసులు, 98 మంది పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సోమవారం జఫార్‌బాద్, వౌజ్‌పూర్, చాంద్‌బాగ్, ఖురేజీ ఖాస్, భాజాన్‌పురలో మొదలైన ఘర్షణలు అనేక ప్రాంతాలకు పాకాయి. సోమవారం నాటి దాడిలో రతన్ లాల్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. చాంద్‌బాగ్‌లో రాళ్ల దెబ్బలకే రతన్ లాల్ చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అల్లర్లలో చనిపోయిన వారి వివరాలను పోలీసు అధికారి తెలిపారు. ఘోండా ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ తీవ్ర గాయాలతో ఆసుప్రతిలో చనిపోయాడు. జగ్‌పర్వేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలాగే కర్దాంపురికి చెందిన మహ్మద్ ఫుర్కాన్ మరణించాడు. 2014లో అతడికి వివాహమైందని ఇద్దరు పిల్లలున్నారని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. కాగా ట్రంప్ పర్యటన నేపథ్యంలో రోడ్లు ఖాళీ చేయాలని బీజేపీ నేత కపిల్ మిశ్రా పోలీసులకు అల్టిమేటం ఇస్తూ చేసిన ట్వీట్ అల్లర్లను ప్రేరేపించిందని మృతుడు మహ్మద్ సోదరుడు మహ్మద్ ఇమ్రాన్ ఆరోపించాడు. కాగా సోమవారం పోలీసు వద్ద నుంచి తుపాకీ లాక్కెళ్లిన వ్యక్తిని గుర్తించారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నగరంలో పరిస్థితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీనియర్ అధికారులు, పార్టీ శాసన సభ్యులతో సమీక్షించారు. ప్రజలు సామరస్యంతో మెలగాలని, వందతులు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.
*చిత్రం... తూర్పు ఢిల్లీలోని వౌజ్‌పూర్ ప్రాంతంలో ఘర్షణల నేపథ్యంలో మంగళవారం గస్తీ నిర్వహిస్తున్న భద్రతా దళాలు