జాతీయ వార్తలు

వివాదంలో అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: అరవై ఐదవ జాతీయ చలన చిత్ర ఆవార్డుల ప్రదానోత్సవం వివాదాస్పదమైంది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కేవలం పదకొండు ముఖ్యమైన అవార్డులు మాత్రమే బహూకరించటంతో దాదాపు డెబ్భై మంది ఇతర బహుమతి గ్రహీతలు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 1954 సంవత్సరం నుండి జరుగుతున్న జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమాన్ని భ్రష్టుపట్టించారని పలువురు అవార్డు గ్రహీతలు ఆరోపించారు. రాష్టప్రతి చేతుల మీదుగా తీసుకోవాల్సిన అవార్డులను మంత్రుల చేతుల మీదుగా ఎలా ఇప్పిస్తారని వారు నిలదీశారు. ‘మీ చేతుల మీదుగా అవార్డులు తీసుకోలేకపోతున్నందుకు బాధగా ఉన్నది, అందుకే ఈ కార్యక్రమానికి తాము హాజరుకావటం లేదు’ అంటూ దాదాపు 70 మంది అవార్డు గ్రహీతలు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కేవలం ఒక గంట పాటు మాత్రమే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర ముఖ్యమైన అవార్డులను బహూకరించగా, అంతకు ముందు కేంద్ర సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ మిగతా అవార్డులను బహూకరించారు.
జాతీయ చలన చిత్ర అవార్డులను రాష్టప్రతి బహుకరించడం ఆనవాయతీ. రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతి పదవి చేపట్టినప్పటి నుండి ఈ నియమాలు మారాయని అంటున్నారు. రామ్‌నాథ్ కోవింద్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలకు ప్రతి రోజు కేవలం ఒక గంట మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ కారణం చేతనే గురువారం కూడా ఆయన కేవలం ఒక గంట సమయం మాత్రమే జాతీయ చలన చిత్ర ప్రదానోత్సవ కార్యక్రమానికి కేటాయించి కేవలం పదకొండు మంది ముఖ్యమైన వారికి మాత్రమే అవార్డులు బహూకరించారు. మామూలుగా అయితే రాష్టప్రతి మొత్తం 137 మందికి అవార్డులు బహూకరించాలి. కానీ సమయాభావం మూలంగా కోవింద్ కేవలం పదకొండు మందికి మాత్రమే అవార్డులు బహూకరించిన తరువాత సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కేవలం 11 మందికి మాత్రమే అవార్డులు బహుకరిస్తారని, మిగతా అవార్డులను కేంద్ర సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ అందజేస్తారనే విషయం తమకు గత రాత్రి చెప్పారని అవార్డు గ్రహీతలు తెలిపారు. ‘ఇది అన్యాయం, రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డులు తీసుకుంటామనుకున్న తమకు నిరాశ ఎదురైంది’ అని పలువురు అవార్డు గ్రహీతలు చెప్పారు. స్మృతి ఇరానీ గత రాత్రి అవార్డు గ్రహీతల వద్దకు వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రామ్‌నాథ్ కోవింద్ కేవలం ఒక గంట పాటు మాత్రమే ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉండి పదకొండు మందికి అవార్డులు బహూకరించిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారనేది కొన్ని వారాల ముందే సభా నిర్వాహకులకు (కేంద్ర సమాచార శాఖ) తెలియజేశామని రాష్టప్రతి భవన్ అధికార ప్రతినిధి అశోక్ మాలిక్ తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్ రాష్టప్రతి పదవి చేపట్టినప్పటి నుండి గణతంత్ర దినోత్సవం, ఇతర అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే అధిక సమయం ఇవ్వటం జరుగుతోంది. మిగతా కార్యక్రమాలు, ముఖ్యంగా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలకు కేవలం ఒక గంట సమయం మాత్రమే ఇస్తున్నామని, ఇదే విషయాన్ని జాతీయ చలన చిత్రోత్సవ నిర్వాహకులకు కూడా తెలియజేశామని ఆయన చెప్పారు. అయితే అవార్డు గ్రహీతలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. 1954 నుండి జరుగుతున్న జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమాల్లో అన్ని అవార్డులను రాష్టప్రతి మాత్రమే బహూకరించటం ఒక ఆనవాయితీగా వస్తోంది, ఈరోజు మొదటిసారి జాతీయ చలన చిత్రోత్సవ అవార్డులు బహూకరించడాన్ని రెండుగా విభజించారు. మొదట స్మృతి ఇరానీ సాయంత్రం నాలుగు గంటలకు మిగతా అందరికీ అవార్డులు బహూకరించగా, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర గంటల వరకు అంటే ఒక గంట పాటు పదకొండు మందికి ముఖ్యమైన అవార్డులు ప్రదానం చేశారని, ఇది సరైన పద్ధతి కాదని పలువురు అవార్డు గ్రహీతలు అభిప్రాయపడ్డారు.

చిత్రం: రాష్టప్రతి చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న శ్రీదేవి భర్త బోనీకపూర్, కుమార్తెలు