జాతీయ వార్తలు

లెక్క కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 22: ఎట్టకేలకు కర్నాటకలో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. కర్నాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరనున్నాయి. ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి బుధవారం విధానసౌధ తూర్పు ద్వారం మెట్ల వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారస్వామితో పాటు కాంగ్రెస్‌కు చెందిన జి పరమేశ్వరప్ప మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. ఇక కేబినెట్‌లో కాంగ్రెస్‌కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు లభించనున్నాయి. జేడీ(ఎస్)కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కతుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడలేదు. రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో అభిప్రాయబేధాలు, మనస్పర్థలు తలెత్తకుండా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ కమిటీ త్వరలో కూర్చుని ఉమ్మడి అజెండాను ఖరారు చేస్తుంది. కాగా ఈ నెల 25వ తేదీన కీలకమైన శాసనసభాపతి, ఉప సభాపతి పదవులకు ఎన్నికను నిర్వహించాలని కూడా ఇరు పార్టీల నేతల సమావేశంలో నిర్ణయించారు. శాసనసభాపతి పదవి కాంగ్రెస్‌కు, ఉప సభాపతి పదవి జేడీయూకు కేటాయించాలనే దానిపై కూడా ఒప్పందం ఖరారైంది. స్పీకర్ పదవికి కాంగ్రెస్ నుంచి రమేష్ కుమార్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మొగ్గుచూపింది. కాగా జేడీఎస్ ఉపసభాపతి పదవికి తన పార్టీ తరఫున అభ్యర్థిని ఖరారు చేయలేదు. మంత్రి వర్గంలో కీలకమైన హోం, ఫైనాన్స్, రెవెన్యూ శాఖల కేటాయింపుపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. కుమారస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత పోర్టు ఫోలియోల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేడీయూ నేత, హెచ్‌డి కుమారస్వామి 24వ తేదీనే అసెంబ్లీని సమావేశపరిచి విశ్వాసపరీక్షకు వెళ్లనున్నారు.
అనేక ఉత్కంఠ కలిగించే పరిణామాల మధ్య బుధవారం కొలువు తీరనున్న హెచ్‌డి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు యుపిఏ పూర్వ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్, రాష్ట్రీయ లోక్‌దళ్ అజిత్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, తమిళనాడులో కొత్తగా పార్టీని ఏర్పాటు చేసిన సినీనటుడు కమలహసన్, డిఎంకె నేత ఎంకె స్టాలిన్ హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపారు.
ప్రభుత్వాన్ని నడపడం పెద్ద సవాలు: కుమారస్వామి
వచ్చే ఐదేళ్ల పాటు కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం పెద్ద సవాలని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న హెచ్‌డి కుమారస్వామి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ శృంగేరి పీఠాన్ని సందర్శించిన తర్వాత విలేఖర్లతో మాట్లాడుతూ, జీవితంలో ఇంత కంటే పెద్దసవాలు ఏముంటుంది అని అన్నారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎదురయ్యే సవాళ్ల గురించి తాను బాధపడడం లేదన్నారు. తనపై ప్రజలు పెట్టిన బాధ్యతలను జవాబుదారీతనంతో నిర్వహిస్తానన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కూటమిపై ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో సందేహాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కాని తాను సవాలుగా స్వీకరించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఆది గురు శంకరాచార్య ఆశీస్సులతో అన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కుతానని ఆయన చెప్పారు. ధర్మస్థలలో మంజూనాథ స్వామి దేవాలయాన్ని కూడా ఆయన సందర్శించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించడంతో ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించిన విషయం విదితమే. ఈ నెల 16వ తేదీన బిఎస్ యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఈ నెల 19వ తేదీన అసెంబ్లీని సమావేశపరిచారు. కాని విశ్వాసపరీక్షకంటే ముందుగానే యెడ్యూరప్ప సిఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత గవర్నర్ జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.