జాతీయ వార్తలు

టార్గెట్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీయేతర పక్షాల సీఎంలు పక్కావ్యూహంతో నీతిఆయోగ్ భేటీకి సిద్ధమయ్యారు. నీతిఆయోగ్ సమవేశానికి ఒకరోజు ముందే ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం ఏపీ భవన్‌లో సమావేశమై నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఏపీ భవన్‌కు చేరుకున్న మమతా, కుమారస్వామి, విజయన్‌లు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే తప్పులను ఎలా ఎత్తిచూపాలన్న అంశాలపై సుదీర్ఘంగా సమాలోచనలు సాగించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా అడ్డుకోవటం తదితర అంశాలను ముగ్గురు సీఎంలకు చంద్రబాబు వివరించారని అంటున్నారు. నరేంద్ర మోదీ ఏకపక్ష విధానాల మూలంగా బీజేపీయేతర ప్రభుత్వాలకు ఎదురవుతున్న ఇబ్బందులనూ వారు చర్చించారని అంటున్నారు. ఢిల్లీకి పూర్తి రాష్టస్థ్రాయి హోదా కల్పించటం, ఐఏఎస్‌లు చేస్తున్న సమ్మె విరమించుకోవాలంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజల్ నివాసంలో చేస్తున్న ధర్నా తదితర అంశాలూ చర్చకు వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నాకు దిగిన అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి మద్దతు ప్రకటించాలని నలుగురు సీఎంలు భావించారు. అయితే కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా తదితరులను కలిసేందుకు అనుమతించటం సాధ్యం కాదని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతించాలంటూ మొదట మమతా బెనర్జీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. మమతా బెనార్జీ విజ్ఞప్తిని లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించటంతో నలుగురు సీఎంలు సమష్టిగా
లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాస్తూ కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతి కోరారు. అయితే నలుగురు సీఎంల విజ్ఞప్తినీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ తిరస్కరించినట్టు తెలిసింది.
ఈ పరిణామాలతో, రాష్టప్రతి భవన్‌లో ఆదివారం జరగనున్న నీతిఆయోగ్ పాలకమండలి నాల్గవ సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవటం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, ఆయుష్మాన్ భారత్.. తదితర పథకాల అమలుపై కేంద్రం, ప్రతిపక్ష సీఎంల మధ్య వాదోపవాదాలకు అవకాశం కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేటి భేటీలో చమురును జీఎస్టీ పరిధిలోకి తేవటం, ఏపీ విభజన హామీల అమలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాలపై గట్టిగానే ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఇదివరకే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో టెలిఫోన్‌లో చర్చలు జరిపి సహకారం కోరారు. శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరిన తరువాతా ఏపీ భవన్‌లో వీరితో మంతనాలు సాగించారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, కుమారస్వామి సైతం తమ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను నీతి ఆయోగ్ పాలక మండలిలో గట్టిగా ప్రస్తావించేందుకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఏకపక్ష వైఖరి కారణంగా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినటంతోపాటు తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం లెఫ్టెనెంట్ గవర్నర్ బైజల్ నివాసంలో బైఠాయింపులో ఉన్నందున పాలక మండలి సమావేశానికి హాజరు కాకపోవచ్చు.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి నాల్గవ సమావేశానికి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రానికి చెందిన వివిధ శాఖల సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. దేశాభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యాలు, రంగాలు, వాటి అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్ర ప్రభుత్వాల క్రియాత్మక భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి సాధనవంటి కీలక అంశాలపై సమావేశంలో లోతుగా చర్చిస్తారు. 2017-18లో సాధించిన విజయాలతోపాటు 2018-19లో సాధించాల్సిన అభివృద్ధి ప్రాధాన్యాలనూ సమీక్షిస్తారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలు, ఆయుష్మాన్ భారత్, జాతీయ పౌష్టికాహార మిషన్, ఇంద్రధనుష్ మిషన్, ఎంపిక చేసిన జిల్లాల అభివృద్ధి, జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు.

చిత్రం..ఏపీ భవన్‌లో శనివారం రాత్రి సమావేశమైన భాజపాయేతరపక్షాల సీఎంలు
చంద్రబాబు, మమతాబెనర్జీ, పినరయ విజయన్, కుమారస్వామి