జాతీయ వార్తలు

ప్రజా ప్రభుత్వానిదే నిజమైన అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: అధికారానికి సంబంధించి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వానికి ధర్మాసనం తీర్పు బలాన్ని ఇచ్చింది. అధికారం కోసం మూడేళ్లుగా ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికే నిజమైన అధికారం అంటూ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అలాగే మంత్రి మండలితో లెఫ్టినెంట్ గవర్నర్ సఖ్యతో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు అన్నింటిలోనూ జోక్యం కూడదని బెంచ్ సలహా ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు సొంత నిర్ణయాలు తీసుకునే తీసుకునే అధికారం లేదని సుప్రీం ప్రకటించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలపై దాఖలైన పిటిషన్లను విచారించి చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే నిజమైన అధికారం. మంత్రిమండలి సలహా మేరకే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాలి’ అని బెంచ్ విస్పష్టంగా తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అనేక అంశాలపై స్పష్టత ఇచ్చింది. అధికారాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మధ్య మూడేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 2015 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేనాటికి నజీబ్ జంగ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు. ఆ తర్వాత ఆయన స్థానంలో అనిల్ బైజాల్‌ను కేంద్రం నియమించింది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయాలు తీసుకుని పాలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నారంటూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం 237 పేజీల తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానిస్తూ, కేంద్రపాలిత రాష్ట్రంగా ఉన్న ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తారనే భ్రమలు పెట్టుకోవాల్సిన పనిలేదని అన్నారు. ‘్ఢల్లీ కేంద్రపాలిత రాష్ట్రానికి విశిష్టమైన స్థానం ఉంది. రాష్ట్ర గవర్నర్ మాదిరిగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఉండవు. కేవలం ఒక పరిపాలక హోదా అది పరిమితంగా ఉంటుంది’ అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఢిల్లీ పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న 239ఏఏ అధికరణపై సుప్రీం స్పష్టత ఇచ్చింది. మంత్రివర్గ నిర్ణయాల అమలుకు అవకాశం కల్పించే ఫెసిలిటేటర్ పాత్రను లెఫ్టినెంట్ గవర్నర్ పోషించాలని కోర్టు హితవు పలికింది. ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య సామరస్యత ఉండాలని కోర్టు పేర్కొంది. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదా రాష్టప్రతి తీసుకునే నిర్ణయాన్ని శిరసావహించడం మినహా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదని కోర్టు కరాఖండిగా పేర్కొంది. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను యాంత్రికంగా రాష్టప్రతికి తెలియచేసే వ్యక్తిలా ఉండరాదని కూడా కోర్టు పేర్కొంది. మంత్రివర్గం తాను తీసుకునే నిర్ణయాలను తప్పనిసరిగా లెప్టినెంట్ గవర్నర్‌కు తెలియచేయాలి. ప్రతి అంశం లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలియచేయాలని లేదు. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్రపాలిత రాష్ట్రం 1993 రూల్స్‌ను సుప్రీంకోర్టు ఉదహరించింది. మంత్రివర్గం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అడ్డుకోకుండా, సామరస్యధోరణితో వ్యవహరించే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉండాలని కోర్టు తెలిపింది. ‘ పబ్లిక్ ఆర్డర్, పోలీసు, భూమి అనే మూడు అంశాల మినహా మిగిలిన అంశాలపై చట్టాలను రూపొందించి అమలు చేసే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ధర్మాసంలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ విడిగా 175 పేజీల తీర్పును వెలువరించారు. ప్రజలకు పాలన అందించేది ప్రభుత్వమని, మంత్రివర్గమనే విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టిలో పెట్టుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ తీర్పులో పేర్కొన్నారు. ఢిల్లీలో పాలనను అడ్డుకునే విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉండరాదన్నారు. జస్టిస్ అశోక్ భూషణ్ 123 పేజీల తీర్పును వెలువరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఢిల్లీ అసెంబ్లీలో ఉంటారు. వారి అభిప్రాయాలను లెఫ్టినెంట్ గవర్నర్ గౌరవించాలి అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను తిరస్కరించే హక్కు లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపరంగా అధిపతి అంటూ ఢిల్లీ హైకోర్టు 2016 ఆగస్టు 4వ తేదీన ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లను రెగ్యులర్ బెంచి రానున్న రోజుల్లో విచారిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎకె సిక్రీ, జస్టిస్ ఎంఎం ఖాన్వీల్కర్ ఉన్నారు.