జాతీయ వార్తలు

రేపే అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం పార్లమెంటులో చర్చకు రానుంది. ఈ తీర్మానంపై బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సోమవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపితే బాగుంటుందని కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే సూచించినా సుమిత్రా మహాజన్ మాత్రం శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని నిర్ణయించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించటంతోపాటు ఎల్లుండి అంటే శుక్రవారం దీనిపై చర్చకు రంగం సిద్ధం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. తెలుగుదేశం ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం తదితరులు ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. తెలుగుదేశంతోపాటు కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. కేశినేని శ్రీనివాస్ అందరికంటే ముందు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినందున దానిని చర్చకు చేపడుతున్నట్లు సుమిత్రా మహాజన్ బుధవారం లోక్‌సభలో ప్రకటించారు. ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉన్నదని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే సుమిత్రా మహాజన్ మొదట కొత్త సభ్యుల చేత ప్రమాణం చేయించారు. అనంతరం దివంగత సభ్యుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అప్పటికే పోడియం వద్దకు చేరుకున్న తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ సభ దద్దరిల్లేలా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం తెలుగుదేశం, ఎస్‌పీ సభ్యుల గొడవ మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. పోడియంను చుట్టుముట్టిన తెలుగుదేశం సభ్యులు అశోక్‌గజపతిరాజు, బుట్టా రేణుక, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, నిమ్మల కిష్టప్ప, గల్లా జయదేవ్, మాగంటి బాబు, అవంతి శ్రీనివాస్, కేశినేని నాని, మల్యాద్రి, పి.రవీంద్రబాబు, ఎస్.పీ.వై.రెడ్డి ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ వారిచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. బిసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాపాడాలంటూ సమాజ్‌వాదీ సభ్యులు నినాదాలు ఇచ్చారు. పోడియం వద్ద గొడవ చేయటం మంచిది కాదని సుమిత్రా మహాజన్ ఎంత హెచ్చరించినా టీడీపీ, ఎస్‌పీ సభ్యులు మాత్రం పట్టించుకోలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజే మీరిలా చేయటం మంచిది కాదని స్పీకర్ చెప్పినా వారు పట్టించుకోకుండా తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతున్నా ఒక గంట పాటు టీడీపీ, ఎస్‌పీ సభ్యులు పోడియం వద్ద నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగియగానే ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించే కార్యక్రమాన్ని సుమిత్రా మహాజన్ పూర్తిచేశారు. ఆ తరువాత ఆమె వాయిదా తీర్మానాల గురించి ప్రస్తావించారు. వాయిదా తీర్మానాల్లో ప్రస్తావించిన అంశాలు ముఖ్యమైనవే అయినా వాటిపై చర్చ జరపవలసిన అవసరం లేదంటూ వాటి ని తిరస్కరించారు. ఇది జరిగిన అనంతరం సుమిత్రా మహాజన్ ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాల గురించి మాట్లాడారు. మీరిలా ఇక్కడ నిలబడి నినాదాలు ఇస్తూ ఉంటే అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టాలా? వద్దా? అనేది నిర్ణయించటం సాధ్యం కాదని స్పీకర్ హెచ్చరించటంతో టీడీపీ, ఎస్‌పీ సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లక తప్పలేదు. సభ ప్రశాంతత నెలకొనగానే సుమిత్రా మహాజన్ టీడీపీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల గురించి ప్రస్తావించారు. తెలుగుదేశం సభ్యుడు కేశినేని శ్రీనివాస్ అందరికంటే ముందు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినందున దానిని చేపట్టాలా? వద్దా? అనేది పరిశీలిస్తానని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్న వారు చేతులెత్తాలని సుమిత్రా మహాజన్ సూచించారు. దీనికి టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు చేతులెత్తి మద్దతు పలికారు. యాభైకంటే ఎక్కువమంది సభ్యుల మద్దతు లభించినందున కేశినేని ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు సుమిత్రా మహాజన్ ప్రకటించారు.