జాతీయ వార్తలు

కేరళకు తక్షణ సాయం రూ.500కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 18: ప్రకృతి విలయతాండవంతో దారుణంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ.500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని, అవసరమైనంత ఆర్థిక సహాయం అందిస్తామని, రాష్ట్రాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కేరళ ప్రజలకు కేంద్రం అండగా నిలబడుతుందని మోదీ ప్రకటించారు. ఆయన కేరళలో వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వరదలు, భారీ వర్షాల వల్ల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ప్రదానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఆర్థికసహాయం అందిస్తారు. ఈ నెల 12వ తేదీన కేరళకు రూ.100 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. దీనికి అదనంగా రూ.500 కోట్ల నిధులు సమకూర్చుతారు. ప్రధాని నరేంద్రమోదీ వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత కొచిలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పంటలు, ఇళ్లకు జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో గవర్నర్ పి సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ , కేంద్ర మంత్రి కేజే ఆల్పాన్స్ పాల్గొన్నారు. కేరళ రాష్ట్రాన్ని మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయన్నారు. జల విధ్వంసానికి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. జలమయమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశించారు. ప్రధాని పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ తక్షణ సహాయం కింద ప్రధాని మోదీ రాష్ట్రానికి రూ.500 కోట్లను కేటాయించారన్నారు. కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం వరదల వల్ల రాష్ట్రానికి రూ. 19,512 కోట్ల నష్టం వాటిల్లింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టం అంచనాలు పెరిగే అవకాశం
ఉంది. రాష్ట్రానికి తక్షణమే రూ.2వేల కోట్ల నిధులు కావాలని కోరినట్లు ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు.
కాగా కేరళలో వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి తిరువనంతపురం చేరుకున్నారు. ఉదయం ఆయన ఉన్నతాధికారులతో ఒక దఫా సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయన్‌ను కలుసుకున్నారు. గత వారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాగా బీమాకంపెనీలు వెంటనే పంట నష్టం వివరాలను నమోదు చేసి నష్టపరిహారాన్ని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని, వీటికి వెంటనే మరమ్మత్తు చేయాలని ప్రధాని ఆదేశించారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తు చేపట్టాలని, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేంద్ర విద్యుత్ సంస్థలు ఎన్టీపీసీ, పీజీసీఐఎల్ రంగంలోకి దిగాలని ఆయన ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.
కేరళ ప్రజలు కష్టకాలంలో ఆత్మస్థైర్యం పోకుండా ప్రకృతితో పోరాడుతున్నారని, వారి పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నట్లు మోదీ చెప్పారు. కేరళ ప్రజలు స్పూర్తికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. జాతి యావత్తు కేరళకు అండగా నిలబడుతుందని, కేరళలో మరమ్మత్తుపనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు దేశం కదిలి వస్తుందన్నారు. ప్రకృతి విలయతాండవంలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ గాయపడిన వారికి సత్వరమే వైద్య సేవలు అందిస్తామన్నారు.