జాతీయ వార్తలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లలో బీఎస్పీ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 17: రాజస్థాన్‌లో డిసెంబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎసీ) రెండువందల స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీవర్గాలు బుథవారం నాడిక్కడ తెలిపాయి. పార్టీ చీఫ్ మాయావతి రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 10న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. కాగా రాజస్థాన్‌తోబాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం లేదని ఈ నెలారంభంలో మాయావతి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని అజిత్‌యోగీ జనతా కాంగ్రెస్‌తో కలిసి తమ పార్టీ ఎన్నికల్లో తలపడుతుందని మాయావతి తెలియజేశారు. గత 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 3.37 శాతం ఓట్లను రాబట్టుకున్న బీఎస్పీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. గతంలో 2008 ఎన్నికల్లో ఈ పార్టీ ఆరు సీట్లు గెలుచుకున్నపుడు 7.60 శాతం ఓట్లు వచ్చాయి. కాగా రానున్న ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నామని 200 సీట్లలో పోటీచేసి సత్తా చాటుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దుంగర్రం గెదార్ చెప్పారు. గత ఎన్నికల్లో బీఎస్పీ 195 అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేసిందని ఆయన గుర్తు చేశారు. త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామని, తర్వాత తమ పార్టీ అధినేత్రి మాయావతి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రచార ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలో ప్రజానీకం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల పట్ల విముఖతతో ఉన్నారని, ఈ తరుణంలో తమ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని నిర్ణయించిందని మరో నేత భగవాన్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తూర్పు జిల్లాలైన భారత్‌పూర్, ధోల్‌పూర్, కరౌలీ, సవైమధోపూర్, ఆల్వార్‌లతో బాటు ఉత్తరాన గల హనుమాన్ ఘర్, శ్రీగంగానగర్, బికనార్ జిల్లాల్లో అధిక సంఖ్యలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన జనాభా ఉన్నారని, అక్కడ తమ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉందని భావిస్తున్నామని సింగ్ తెలిపారు. రాష్ట్రంలో 34 ఎస్సీ, 25 ఎస్టీ అసెంబ్లీ రిజర్వు నియోజకవర్గాలున్నాయని వీటితోబాటు తమ పార్టీ మొత్తం రెండువందల సీట్లలో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. బీఎస్పీ విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం వుందని ఆయన చెప్పారు. ఇలావుండగా ఈ రాష్ట్రంలో బీస్పీ 1990 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత 1998లో తొలిసారి రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో 108మంది అభ్యర్థులను ఈ పార్టీ రంగంలోకిదించగా 2.17 శాతం ఓట్లు పొంది ఇద్దరు మాత్రమే గెలిచారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో 124 సీట్లలో ఈ పార్టీ అభ్యర్థులు పోటీచేయగా రెండు సీట్లలో మాత్రమే గెలిచింది. 3.98 శాతం ఓట్లు ఆ ఎన్నికల్లో ఈ పార్టీకి అదనంగా వచ్చాయి.
తర్వాత 2008 ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఈ పార్టీ నేతలు ఓట్ల శాతాన్ని 7.60కు పెంచుకున్నారు, ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలు తమకు అతిపెద్ద విజయాన్ని చేకూరుస్తాయన్న విశ్వాసం బీస్పీ నేతల్లో వ్యక్తమవుతోంది.