జాతీయ వార్తలు

ఎంజే అక్బర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనేక మంది మహిళా జర్నలిస్టులు గతంలో అక్బర్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన నేపథ్యంలో ఆయన వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన ఫలితంగా బుధవారం మంత్రి పదవినుంచి తప్పుకున్నారు. నిన్నటి వరకు మంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరించిన అక్బర్ బుధవారం అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన 67 ఏళ్ల అక్బర్ తాను దాఖలు చేసిన పరువునష్టం కేసు గురువారం విచారణకు రానున్న తరుణంలో అంతకు ముందు రోజే మంత్రి పదవికి రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం అక్బర్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ప్రియారమణి అనే మహిళా జర్నలిస్టు చేసిన ఆరోపణలపై ఆయన పరువునష్టం దావా వేశారు. తాను కోర్టులో వ్యక్తిగత హోదాలోనే న్యాయం కోసం పోరాడాలని అనుకుంటున్నానని, అందువల్లే మంత్రి పదవికి రాజీనామా చేశానని అక్బర్ తెలిపారు. తనకు ఇంతకాలం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు అక్బర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్బర్ తనపై వచ్చిన ఆరోపణలను వ్యక్తిగత హోదాలోనే ఎదుర్కోవాలనే వాదన ప్రభుత్వంలో గట్టిగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత పది రోజుల్లో కనీసం 20 మంది మహిళలు అక్బర్ వివిధ పత్రికల్లో ఎడిటర్‌గా పనిచేసిన రోజుల్లో ఆయన చేతుల్లో తాము పడిన లైంగిక హింసను వివరించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు, అనేక మీడియా సంస్థలు అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి.
అక్బర్ రాజీనామాను పలువురు బాధిత మహిళలతో పాటు రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ‘అక్బర్ రాజీనామా మహిళలంగా మేము చేసిన ఆరోపణలు వాస్తవమని నిరూపిస్తోంది. కోర్టులో కూడా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఆ రోజుకోసం వేచి చూస్తున్నా-మీటూ’ అంటూ రమణి ట్వీట్ చేశారు. అక్బర్ రాజీనామా ‘నిజం సాధించిన విజయం’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించినప్పటికీ ధైర్యంగా ముందుకు వచ్చి తమపై జరిగిన లైంగిక దాడిని వెల్లడించిన మహిళలను ఆమె అభినందించారు. అక్బర్ కేవలం రాజీనామా చేస్తే సరిపోదని, అతనిపై వెంటనే నేర విచారణ ప్రక్రియను ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికార ప్రతినిధి దిలీప్ పాండే డిమాండ్ చేశారు. అక్బర్ రాజీనామాను ‘ద ఏసియన్ ఏజ్’ ఇంగ్లీషు దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ సుపర్ణ శర్మ స్వాగతించారు. అక్బర్ ఢిల్లీకి చేరిన వెంటనే రాజీనామా చేసి ఉండాల్సిందని రమణికి మద్దతుగా నిలిచిన మీనాల్ బాఘెల్ పేర్కొన్నారు. అక్బర్ రాజీనామా చాలా ఆలస్యమయిందని రచయిత కిరణ్ మన్‌రాల్ పేర్కొన్నారు.
నేడు విచారణ
ప్రియారమణిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో గురువారం విచారణకు రానుంది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట ఈ కేసు విచారణకు వస్తుందని కరంజవాలా అండ్ కంపెనీకి చెందిన అక్బర్ తరపున వాదిస్తున్న న్యాయవాది సందీప్ కపూర్ తెలిపారు. అక్బర్ సోమవారం రమణికి వ్యతిరేకంగా పరువునష్టం కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని కూడా సందీప్ కపూర్ వెల్లడించారు.