శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఓం శ్రీ ఆంజనేయం మార్మోగిన ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 31: హనుమజ్జయంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని శ్రీరామక్షేత్రాలు, ఆంజనేయస్వామి దేవస్థానాలు వాయుపుత్రుని నామస్మరణతో మారుమోగాయి. దర్గామిట్టలో ఉన్న శబరి శ్రీరామక్షేత్రంలో ఆంజనేయస్వామికి వేకువజాము నుంచే అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు లక్షమల్లెల అర్చన, 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాలు శాస్తయ్రుక్తంగా జరిగాయి. సుందరకాండ పారాయణం జరిగింది. అనంతరం అన్నదానం చేశారు. సాయంత్రం పిల్లలకు వెండి కంకణధారణ, పల్లకి ఉత్సవ అనంతరం స్వామివారి నగరోత్సవ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. మూలాపేట ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు నిర్వహించారు. అక్కడ చాట్ల రామారావు భక్తులకు అన్నదానం చేశారు. సంతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం, ఆచారి వీథిలోని పురాతన ఆంజనేయస్వామి దేవస్థానాల్లో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆంజనేయ స్వామి దేవాలయాలు అన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి. హరనాధపురంలో గల అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, సంతపేట, కొనేటిమిట్టలో గల ఆంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి దేవాలయంలో తెల్లవారుజామున నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా స్వామివారికి ఆకుపూజ, అర్చన తదితర పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలు దేవాలయాల్లో స్వామివారికి చందన అలంకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
భక్తులకు అన్నదానం
హనుమజ్జయంతిని పురస్కరించుకుని జయభారత్ ఆసుపత్రి సమీపంలోని సంజీవ హనుమాన్ దేవాలయంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్తుడు చిన్న అబ్బయ్య ఆధ్వర్యంలో 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది హనుమజ్జయంతి పర్వదినాన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి హాజరయ్యారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మంగీలాల్ చౌహాన్, కమల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వేమిరెడ్డికి నిరాశ
దక్కని రాజ్యసభ టిక్కెట్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మే 31: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ వద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావించడంతో జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. నాల్గవ స్థానానికి బలం లేకుండా పోటీకి దింపడం సరికాదనే భావన టిడిపి నేతలతో పాటు బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడులాంటి వ్యక్తుల నుంచి కూడా రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయాలని కోరడంతో తొలుత నిర్ణయాన్ని వారికే వదిలేసిన చంద్రబాబు చివరకు పలువురు సీనియర్ నేతల సూచనతో పోటీ వద్దని నిర్ణయం తీసుకున్నారు. వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డికి పోటీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా నిలపాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పలువురు నేతలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ చంద్రబాబు బిజీగా గడిపారు. చివరకు మధ్యాహ్నానికి ఒక నిర్ణయానికి వచ్చి పోటీ చేయకూడదని నిశ్చయించుకున్నారు. దీంతో రాజ్యసభ స్థానం కోసం ఆశలు పెట్టుకున్న వేమిరెడ్డికి నిరాశ కలిగించింది. అయితే బలం లేకుండా పోటీ చేసి ఎమ్మెల్యేలను ఆకర్షించడం వల్ల ప్రజాస్వామ్య విలువలు మంటగలుపుతున్నారంటూ ప్రతిపక్ష నేతల విమర్శలతో పాటు ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో అధినేత ఈ పోటీ నుంచి తప్పుకోవాలని భావించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జిల్లాకు చెందిన నేతల పేర్లే ఎక్కువగా వినిపించాయి. చివరకు వచ్చేసరికి జిల్లాకు రిక్తహస్తం మిగిలింది.

2 నుంచి నవ నిర్మాణ దీక్షలు ప్రారంభం:కలెక్టర్
వేదాయపాళెం, మే 31: రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూన్ 2వ తేది నుంచి నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం.జానకి తెలిపారు. మంగళవారం కలెక్టర్ ప్రాంగణంలోని గోల్డెన్ జూబ్లీ హాలులో నవనిర్మాణ దీక్షకు సంబంధించి అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు పూర్తయినందున దానికి అనుగుణంగా జిల్లా ముఖ్యకేంద్రాలలో, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యకేంద్రాలలో నవ నిర్మాణ దీక్షల కార్యక్రమాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాలు జూన్ 2వ తేది నుంచి 8వ తేది వరకు నిర్వహించడానికి తగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. జూన్ 2వ తేదిన సభను ఏర్పాటు చేయడం తర్వాత ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షపై ప్రతిజ్ఞ చేసేటప్పుడు ప్రజలందరూ ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రతి ఇంట్లోనూ ఈ ప్రతిజ్ఞను చేయాలని ఆమె కోరారు. అధికారులు ఈ విషయంపై తగు చర్యలు తీసుకొని నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలలో ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రైవేటు సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ సమష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో జెసి-1 ఏఎండి ఇంతియాజ్, జెసి-2 సాల్మన్‌రాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అపరిష్కృత కేసులపై దృష్టి నిలపాలి
పోలీసు సిబ్బందికి ఎస్‌పి ఆదేశం
నెల్లూరు, మే 31: పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో జిల్లాలోని డిఎస్పీ, సిఐ, ఎస్సైలతో ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి, యాక్సిడెంట్ జోన్లలో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలనీ, అందులో భాగంగా రేడియం స్టిక్కర్లను ట్రాఫిక్ స్ట్ఫార్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా ట్రాఫిక్ డిఎస్పీ ఎన్.రామారావుకు సూచించారు. డిఎస్పీలు, సిఐలు తమ పరిధిలోని స్టేషన్లను తరచూ తనిఖీ చేస్తూ ఎస్సైలకు పెండింగ్ కేసుల పరిష్కారానికి తగిన సూచనలు అందచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సైలు మన ఊరు-మన పోలీస్ కార్యక్రమంలో భాగంగా తాము చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు, డిఎస్పీలు, సిఐలు, జిల్లాలోని స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.

చంద్రబాబువి నీచ రాజకీయాలు
* వైకాపా ఎమ్మెల్యేల ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మే 31: రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని గెలుపించుకోవాలన్న తపనతో సిఎం చంద్రబాబునాయుడు వైకాపా ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్నారని ఇంతకంటే నీచమైనది మరొకటి ఉండదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో గల జిల్లా వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడారు. తమకు ఒక అభ్యర్థినిని సునాయాసంగా గెలుపించుకునే శక్తి ఉందని అయినా చంద్రబాబు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని అన్నారు. ఏదిఏమైనా తమ అభ్యర్థి విజయం సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని విమర్శించిన టిడిపి నేడు బిజెపి అభ్యర్థి సురేష్ ప్రభుకు రాజ్యసభ విషయంలో ఎలా మద్దతు ఇస్తుందో ప్రజలే గమనించాలన్నారు. బిజెపి, టిడిపి రెండు పార్టీలు అంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని ధ్వజమెత్తారు. మేధావులను రాజ్యసభకు పంపాల్సిన చంద్రబాబు కాంట్రాక్టర్లను, ధనవంతులను, పారిశ్రామికవేత్తలను పంపుతున్నారని అన్నారు. టిడిపిలో మూటలు ఇచ్చిన వారికే సీట్లు లభిస్తాయని అన్నారు. ఈ ఏడాది మే ఒకటి నాటికి చంద్రబాబు అవినీతి లక్షా 44 వేల 571 కోట్లకు చేరిందని అన్నారు. దీనిని తాము సాక్ష్యాధారాలతో సహా ఓ పుస్తకాన్ని ప్రచురించామని అన్నారు. మహానాడులో సిఎం తనను తాను పొగుడుకోవడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో నాడు చేసిన తప్పే నేడు ఎపిలో చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అనుసరించిన విధానానే్న నేడు ఎపిలో అనుసరిస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎపి రాజకీయాలను దిగజార్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అడ్డదారిలో అవినీతికి పాల్పడుతూ తనకున్న అనుభవాలతో అక్రమంగా సంపాదించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ నుంచి టిడిపిలోకి వలస వెళ్లిన ఎమ్మెల్యేలు ఐదారు మంది ఇప్పటికీ తమతో మాట్లాడుతున్నారని తాము మోసపోయామని చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాను మోసపోయానని పాశం సునీల్‌కుమార్ తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఎవరు ఆ ఐదారు మంది చెప్పాలంటూ పదేపదే అడగటంతో ఆయన దాటవేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కె సంజీవయ్య మాట్లాడుతూ, చంద్రబాబుకు మనస్సాక్షి లేదన్నారు. నిత్యం నీతిమాలిన పనులు చేస్తూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు. నీతి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి క్యాంప్ రాజకీయాలకు ఎపిలో తెరతీసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పదేపదే అబద్ధాలు చెపితే అవి నిజమవుతాయని బాబు అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 2019లో జరిగే ఎన్నికలు టిడిపికి చివరి ఎన్నికలవుతాయని ఆయన జోస్యం చెప్పారు.

మధురానగర్‌లో మూడు చోరీలు
నెల్లూరు, మే 31: అపోలో హాస్పటల్ సమీపంలోని మధురానగర్‌లో ఉన్న శే్వతా రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసిన ప్లాట్లను లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు శే్వతా అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ 101లో డాక్టర్ కె నరసింహారెడ్డి, 103, 204లలో అధ్యాపకులు శీనయ్య, 302లో డాక్టర్ భార్గవ్ నివాసం ఉంటున్నారు. వీరంతా తమతమ వ్యక్తిగత కారణాలతో కుటుంబంతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లారు. ఈనేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి చోరీలకు పాల్పడ్డారు. ప్లాట్ తాళాలు పగలుగొట్టిన విషయం గమనించిన సహచర ప్లాట్ యజమానులు చోరీ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీనగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నరసింహారెడ్డి ఇంటిలో అర కేజీ వెండి ఆభరణాలు, రూ. ఐదు వేలు, శీనయ్య ఇంటిలో పది సవర్ల బంగారు ఆభరణాలు, భార్గవ్ ఇంటిలో యాపిల్ ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లు అపహరించుకు వెళ్లినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. బాధితులు నెల్లూరుకు తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఘనంగా హంస వాహన ఉత్సవం
బుచ్చిరెడ్డిపాళెం, మే 31: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం తొలుత గణపతిపూజ, పుణ్యాహవచనానంతరం తిరుచా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామి అమ్మవార్లకు పూజలర్పించారు. రాత్రి స్వామి అమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా జొన్నవాడకు చెందిన మల్లికార్జున శర్మ, రేబాలకు చెందిన లేబూరు శ్రీనివాసులరెడ్డి, లేబూరు రాధాకృష్ణారెడ్డి వ్యవహరించారు.
నేడు రావణ సేవ
బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమాల్లో ఒకటైన రావణ సేవ ఉత్సవం బుధవారం జరుగనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు సన్నపరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన భక్తులను కోరారు.

బైక్, లారీ ఢీ
తాతా, మనవడు మృతి
దుత్తలూరు, మే 31: దుత్తలూరు మండలం నందిపాడు కూడలికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న మోటార్ బైక్, లారీ ఢీకొనడంతో తాత మనువడు మృతి చెందిన వైనమిది. మంగళవారం హనుమజ్జయంతి వేడుకల్ని ఉదయగిరి మండలంలోని వెంకటంపేట ఆలయం వద్ద దర్శించుకుని తిరిగి ఇంటికి మోటార్‌బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కౌశిక్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అతని తాతయ్య ఎస్ శివరామయ్యను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. అదే బైక్‌పై ఉన్న శివరామయ్య సతీమణితోపాటు కౌశిక్ సోదరికి కూడా గాయాలయ్యాయి. శివరామయ్యది ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామం. ఆయన కుమార్తెను చేజర్ల మండలం కొల్లయ్యనాయుడుపల్లి గ్రామనికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పుట్టింటికి వచ్చిన సందర్భంలో తాత, అమ్మమ్మ మనువడు, మనువరాలు ఓ బైక్‌పై వెంకటంపేటకు వెళ్లారు. అలాగే ఆ దంపతుల కుమార్తె, అల్లుడు మరో బైక్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్, లారీ ఢీకొనే సందర్భంలో కొద్దిదూరం ముందులోనే కుమార్తె, అల్లుడి వాహనం కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పోస్టుమార్టమ్ వద్దని వారి బంధువులు కోరడంతో పోలీసులు ఆ దిశగా సమ్మతించారు.