జాతీయ వార్తలు

ఉల్లి రైతు కంట కన్నీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 24: ఉల్లిపాయ కోస్తే కన్నీరు... ధర పెరిగితే వంటింట్లో కన్నీరు... ధర తగ్గిపోతే రైతు కంట్లో కన్నీరు... ఉల్లిపాయ విషయంలో ఎటుచూసినా కన్నీరే మిగులుతోంది. కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటి దేశవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. తాజాగా ఉల్లిపాయల ధరలు దారుణంగా పడిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. ఇదీ నేటి పరిస్థితి. మహారాష్టల్రోని పలు ప్రాంతాల్లో ఈసారి ఉల్లి దిగుబడి ఊహించిన దానికన్నా అధికంగా వచ్చింది. దేవిదాస్ పర్భానే (48) అనే రైతు కూడా ఉల్లి సాగు చేశాడు. ఈసారి దిగుబడి భారీగా ఉండటంతో అతని సంతోషానికి అవధుల్లేవు. ఎందుకంటే ఐదుగురు సభ్యులున్న దేవిదాస్ కుటుంబం దానిమీదే ఆధారపడి వుంది. ఈసారి లాభం వస్తుందని అతను ఎంతో ఆశపడ్డాడు. అయినా ఏం లాభం? టన్ను ఉల్లిపాయలను మార్కెట్‌కు తరలిస్తే దేవిదాస్ ఇంటికి వెళ్లేటప్పటికి మిగిలింది ఒకే ఒక్క రూపాయి! అన్ని ఖర్చులు పోను నాకు మిగిలింది రూపాయేనని దేవిదాస్ చెబుతున్న లెక్కలు ఉల్లి రైతుల అవస్థను చాటుతోంది. 80వేలు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేస్తే 952 కిలోల దిగుబడి వచ్చిందని, దాన్ని పుణె మార్కెట్‌కు తరలించి అమ్మితే రూ.1523.20 పైసలు వచ్చిందని దేవిదాస్ వాపోయాడు. రవాణా ఖర్చులు, కమిషన్లు పోగా ఒక్క రూపాయి మిగిలిందని దేవిదాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. కరవు ప్రాంతాల్లో దిగుబడి రాక వ్యవసాయ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఉల్లి దిగుబడి పెరిగినా గిట్టుబాటు ధర లేక ఉల్లి సాగుదారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని దేవిదాస్ కన్నీరు మున్నీరవుతున్నాడు. కిలోకు కనీసం మూడు రూపాయలు ధరలు పలుకుతుందని ఆశ పడ్డానని, కానీ కనీసం ఖర్చులు కూడా రాలేదని, భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని వాపోయాడు. అయితే ఉల్లి ధరలపై తగ్గిపోవడంపైనా, రైతుల ఆరోపణలపైనా మార్కెట్ వర్గాలు స్పందించలేదు. దేవిదాస్ తీసుకువచ్చిన ఉల్లిపాయలు నాణ్యత తక్కువగా ఉండటంతోపాటు చిన్నగా ఉన్నాయని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను పుణె మార్కెట్ ఉల్లి వ్యాపారులు కలిసి విజ్ఞప్తి చేశారు.