జాతీయ వార్తలు

రాహుల్‌కు పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టనున్నారా? ఈ విషయంలో సోనియాగాంధీ తుది నిర్ణయానికి వచ్చేశారా? రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తర్జన భర్జనల అనంతరం సోనియా ఎట్టకేలకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. సిడబ్ల్యుసిలో కూలంకషంగా చర్చించి ప్రకటించే అవకాశం ఉందని కూడా అంటున్నాయి. సిడబ్ల్యుసి సమావేశం శుక్రవారం జరిగే అవకాశముందని పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. రాహుల్ గాంధీని కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమించి, పార్టీ అధ్యక్షురాలిగా సోనియా మరికొంతకాలం కొనసాగాలని సీనియర్ నాయకులు వాదిస్తున్నట్లు తెలిసింది. అయితే రాహుల్ వర్గం మాత్రం ఆయన అధ్యక్ష పదవిని మాత్రమే చేపడతారని స్పష్టం చేస్తోంది. రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడుగా నియమించటంతోపాటు ఎఐసిసి పునర్ వ్యవస్థీకరణ కూడా జరుగుతుందని అంటున్నారు. పిసిసి, డిసిసిలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించి, పిసిసిలకు కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేయవచ్చునని చెబుతున్నారు. సిడబ్ల్యుసి, ఎఐసిసి పునర్‌వ్యవస్థీకరణ, పిసిసి, డిసిసిల్లో యువతకు పెద్దపీట వేయాలని రాహుల్ దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే పార్టీలో సమూలమైన మార్పులు చేస్తారనే మాట వినిపిస్తోంది. రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడుగా నియమించిన అనంతరం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా సోనియా కొంతకాలం కొనసాగుతారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుని రాహుల్‌కు పూర్తి బాధ్యతలు ఒక్కసారిగా అప్పగిస్తే అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మోతీలాల్ వోరా, ఆనంద్ శర్మ, ఏ.కె.ఆంటోని, అంబికాసోని తదితర సీనియర్ నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటారనే వాదన కూడా వినిపిస్తోంది.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే మాట రెండేళ్లుగా వినిపిస్తోంది. పార్టీకి సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటంలో రాహుల్ ఇప్పటికే ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలలో మాత్రమే సోనియా జోక్యం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ రోజువారీ కార్యకలాపాలను రాహుల్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేశారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా ఆయనే చేపట్టారు. ఇక పార్టీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఆయనే తీసుకుంటున్నారు. పిసిసిలకు అధ్యక్షులను నియమించటం, సిఎల్‌పి నాయకులను ఎంపిక చేయటం తదితర అంశాలపై ఆయనదే తుది నిర్ణయంగా మారింది. చివరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు, కొనసాగింపు విషయంలో సైతం జోక్యం చేసుకుంటున్నారు.
ఎంపికపై అసమ్మతి
కాంగ్రెస్ పరాజయాలకు ప్రధాన కారకుడైన రాహుల్‌ను అధ్యక్షుడుగా నియమించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఆశించిన స్థాయిలో రాహుల్ రాజకీయంగా ఎదగలేకపోయారన్నది వారి వాదన. సీనియర్ల అభిప్రాయాలను ఖాతరు చేయని రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను కొంతకాలం కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమించి, అధ్యక్ష పదవిలో సోనియా కొనసాగటం మంచిదని ఇద్దరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతోపాటు ఇటీవలి వరకు జరిగిన ఎన్నికల్లో రాహుల్ వ్యవహరించిన తీరు వలన పార్టీకి లాభం కంటే నష్టమే అధికంగా జరిగిందని వారు వాదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయనేది అందరికి తెలిసిందేనని సీనియర్ నాయకులు చెబుతున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ తీరు కూడా రాహుల్ నాయకత్వ పటిమను తేటతెల్లం చేస్తోందని ఒక సీనియర్ నాయకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లోని యువ నాయకులు మాత్రం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వెంటనే చేపట్టటంతోపాటు పాత తరం నాయకులందరిని ముఖ్యమైన పదవుల నుండి తొలగించాలని వాదిస్తున్నారు. కాంగ్రెస్‌లో యువతరానికి పెద్దపీట వేయటం ద్వారానే పార్టీని పునరుజ్జీవింపచేసుకోవటంతోపాటు వచ్చే రెండేళ్లలో జరిగే దాదాపు పధ్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చూపించేందుకు అవకాశం ఉంటుందని రాహుల్ వర్గం వాదిస్తోంది. సీనియర్ల సలహాలు లేకపోతే ముందుకు సాగలేమనే అభిప్రాయం సరైంది కాదని వారు వాదిస్తున్నారు.