జాతీయ వార్తలు

జిఎస్టీపై కలసిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: నేటినుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు, కాశ్మీర్ ఉద్రిక్తతలు, ఎన్డీయే విధించిన రాష్టప్రతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేయడం, ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లభించకపోవటం, గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై ఘాటుగానే చర్చ జరగనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవటంలో విజయం సాధించిన కాంగ్రెస్, గవర్నర్లు వ్యవహరిస్తోన్న తీరుపై ఎన్డీయే సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతోంది. ఏకీకృత పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపైనా గట్టిగానే చర్చ జరగొచ్చు. కామన్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు సిఫార్సులు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం జాతీయ లా కమిషన్‌ను కోరటం తెలిసిందే.
జిఎస్‌టి (సరుకులు, వస్తు సేవలు) బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడేందుకు ప్రతిపక్షాలు తమతో సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటినుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా మోదీ ఆదివారం అఖిలపక్ష నేతలతో చర్చలు జరిపారు. జిఎస్‌టి బిల్లు దేశానికి ఎంతో అవసరమని అంటూనే, బిల్లు ఆమోదంతో ఏ ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనేది ముఖ్యం కానే కాదన్నారు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు జిఎస్‌టిని సమర్థించాలని విపక్షాలను కోరారు. జిఎస్‌టికి మద్దతు అంశంపై కాంగ్రెస్ వైఖరిలో కొంత మార్పొచ్చింది. అయితే బిల్లుకు మద్దతిస్తారా? లేదా? అనేది స్పష్టంగా చెప్పటం లేదు. ఈ అంశంపై తామింకా ఒక నిర్ణయానికి రాలేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. జిఎస్‌టిపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రతిపాదనతో కూడిన ముసాయిదా బిల్లు పంపిస్తే దాన్ని పరిశీలించిన తరువాత కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు. బిల్లులోని మూడు వివాదాస్పద అంశాలకు ప్రభుత్వం సమాధానమిస్తే తాము మద్దతిచ్చే విషయం పరిశీలిస్తామన్నారు. జిఎస్‌టి బిల్లు విషయంలో కాంగ్రెస్‌తో నెలకొన్న విభేదాల పరిష్కారానికి ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్, సమాచార మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్, ఆనంద్‌శర్మలతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. మలిదఫా చర్చలు మంగళవారం జరుపనున్నారు. కాంగ్రెస్‌తో మంగళవారం జరిపే చర్చలు ఫలిస్తే జిఎస్‌టి బిల్లుకు వర్షాకాల సమావేశాల్లో సునాయసంగా మోక్షం లభిస్తుంది. కాంగ్రెస్ మద్దతివ్వని పక్షంలో ఇతర ప్రతిపక్షాల మద్దతు సంపాదించేందుకూ అధికారపక్షం తెరవెనక ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, బిజెడి, సమాజ్‌వాదీ, బిఎస్పీ తదితర పక్షాలు జిఎస్‌టి బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించుకోవటంతో రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీల బలం బాగా తగ్గింది. తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు మద్దతిస్తే జిఎస్‌టి బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను మరింత మెరుగుపర్చుకునేలా ఎన్డీయే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలావుంటే కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పార్లమెంటు ఉభయ సభల్లో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ సమావేశాల్లో జిఎస్‌టితోపాటు, ప్రాధాన్యత కలిగిన మరో నాలుగైదు బిల్లులపై చర్చ జరిపి ఆమోదించాల్సి ఉంది.