జాతీయ వార్తలు

నేడు కోర్టుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు పటియాలా ట్రయల్ కోర్టుకు హాజరైనప్పుడు ఏమవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కోర్టు అరెస్టుకు ఆదేశించే స్థితిలో అరెస్టుకావాలి తప్ప బెయిల్ పెట్టుకోకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. సోనియా, రాహుల్ అరెస్టయితే రాజకీయంగా లబ్దిపొందుతారని బిజెపి నేతలు ఆందోళన చెందుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో తమకెలాంటి సబంధంలేదని బిజెపి అధినాయకత్వం వాదించటం తెలిసిందే. కోర్టు వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పటిషన్ మేరకు తమముందు హాజరుకావాల్సిందిగా పటియాలా ట్రయల్ కోర్టు ఆదేశించటం తెలిసిందే. సోనియా, రాహుల్ పటియాలా ట్రయల్ కోర్టుకు హాజరైనప్పుడు కోర్టు ఆవరణలో ఎలాంటి హంగామా చేయకూడదని, నినాదాలు ఇవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతలు, శ్రేణులను ఆదేశించింది. కోర్టు హాజరీకి రాజకీయ రంగు పులమకుండా హుందాగా వ్యవహరించాలని సోనియా, రాహుల్ చెబుతున్నా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సిఎంలు, ఆయా రాష్ట్రాల మంత్రులు, పార్టీకి చెందిన ఎంపీలు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల నుంచి నేతలెవ్వరూ కోర్టుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి రాకూడదనే తాకీదు జారీ అయినప్పటికీ రాష్ట్రాల నుంచి పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొందరు నేతలు నేటి ఉదయానికి చేరుకోనున్నారు. సోనియా, రాహుల్‌కి నైతికంగా మద్దతు పలికేందుకు తాము కోర్టుకెళ్తామని పలువురు కాంగ్రెస్ ఎంపీలు చెప్పారు. పటియాలా ట్రయల్ కోర్టు నేడు తమముందు హాజరవుతున్న సోనియా, రాహుల్ అరెస్టుకు ఆదేశించకపోవచ్చనీ అంటున్నారు. తాను ఇందిరా గాంధీ కోడల్ని కాబట్టి ఎవ్వరికీ భయపడేది లేదని సోనియా ఇదివరకే ప్రకటించారు. గతంలో ఇందిర మాదిరిగా తానుకూడా అరెస్టై జైలుకెళ్లటం ద్వారా తమ నిజాయితీ నిరూపించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నారు. అందుకే సోనియా, రాహుల్ ఇంతవరకు బెయిల్ తీసుకునేందుకు అవసరమైన న్యాయపరమైన ఏర్పాట్లేమీ చేసుకోలేదు. నేషనల్ హెరాల్డ్ కేసు నాన్ బెయిల్‌బుల్ కాదు కాబట్టి కాంగ్రెస్ అధినేతలు అరెస్టయ్యే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్ ఎంపీలు, సిఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్లు శనివారం మధ్యాహ్నం 12 గంటలకే పటియాలా కోర్టుకు వస్తున్నందున పోలీసులు కోర్టులోపల, బయట పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టుచుట్టూ నిషేధాజ్ఞలు విధించారు. సోనియా, రాహుల్ శనివారం మధ్యాహ్నం 1గంటకు పటియాలా కోర్టుకు వస్తారని చెబుతున్నారు.
ఈరోజేమీ మాట్లాడను
శనివారం కోర్టుకు హాజరుకావటంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని సోనియా అన్నారు. పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం ఆమెను మీడియా కలిసి ప్రశ్నించినపుడు సోనియా సమాధానం చెప్పేందుకు అంగీకరించలేదు. రేపటి కోసం ఎదురుచూస్తున్నా అంటూ ముందుకెళ్లిపోయారు.