జాతీయ వార్తలు

తేల్చవలసింది లోక్‌సభ స్పీకరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనేది నిర్ధారించే భారాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై పెట్టారు. ఆ బిల్లు ద్రవ్య బిల్లేనని స్పీకర్ నిర్ధారిస్తే దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరగదు. సుమిత్రా మహాజన్ ఇందుకు భిన్నంగా నిర్ణయించే పక్షంలో సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది. అయితే, బిల్లుపై తనకు అనుమానాలు ఉన్నందున లోక్‌సభ స్పీకర్‌కు పంపుతున్నట్టు రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజి కురియన్ రూలింగ్ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం రాజ్యసభలో ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు, అభిప్రాయాలు విన్న తరువాత కురియన్ రూలింగ్ ఇచ్చారు. కురియన్ రూలింగ్‌తో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి గొడవ చేశారు. ఆంధ్రకు న్యాయం చేయాలని, సవరణ బిల్లుపై ఓటింగ్ జరపాలని, కురియన్ రూలింగ్‌తో ఏకీభవించటం లేదంటూ రామచందర్‌రావు, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామిరెడ్డి, రేణుకాచౌదరి సహా పలువురు సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలిచ్చారు. బిల్లుపై చర్చ జరిగి, ఆర్థిక మంత్రి సమాధానమిచ్చాక ఓటింగ్ జరపాల్సిన సమయంలో అధికార పక్షం దీన్ని ద్రవ్య బిల్లుగా చిత్రీకరించటం ద్వారా ఐదు కోట్లమంది ఆంధ్రుల అధికారాన్ని హరిస్తోందంటూ కాంగ్రెస్ సభ్యుల బిజెపిపై విరుచుకుపడ్డారు. సవరణ బిల్లుపై ఓటింగ్ జరపాలని, ఇది ద్రవ్య బిల్లు కాదంటూ రామచందర్‌రావు గొంతు చించుకుని నినాదాలిచ్చారు. బిజెపి ప్రభుత్వం తన హక్కులను హరిస్తోంది కాబట్టి, తన ప్రయోజనాలను కాపాడాలంటూ డిప్యూటీ స్పీకర్‌కు మొర పెట్టుకున్నారు. సవరణ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం తెలిపిన తరువాతే సభలో చర్చ జరిగింది. అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సాంకేతిక అంశాల సాకుతో సవరణ బిల్లును దెబ్బతీస్తోందన్నారు. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది. విభజన జరిగి రెండేళ్లవుతున్నా, ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు కనుకే ఇప్పుడు సవరణ బిల్లును ప్రతిపాదించాల్సి వచ్చిందని అన్నారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేస్తారా? లేదా? అన్నదే అసలు విషయమని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రభుత్వాన్ని నిలదీశారు. పధ్నాల్గవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వటం లేదంటూ చెప్పి ఆర్థిక మంత్రి జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ దుయ్యబట్టారు. తెదేపా సభ్యుడు సిఎం రమేష్, సీనియర్ సభ్యుడు గుజ్రాల్ సైతం ఇలాంటి వాదనే చేశారు. అందరి వాదనలు విన్న డిప్యూటీ స్పీకర్ కురియన్, సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనే దానిపై అనుమానాలు ఉన్నందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 186, 8 ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు పంపుతున్నట్టు రూలింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులు నెమ్మదించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభ గౌరవం కాపాడండి: మన్మోహన్
ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని తాను సభలో ఇచ్చిన హామీని అమలు చేయటం ద్వారా రాజ్యసభ గౌరవాన్ని నిలపాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బిజెపి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీకి హోదా విషయమై అప్పటి కేంద్ర కేబినెట్‌లోనూ నిర్ణయించామని స్పష్టం చేశారు. అప్పటి రాజ్యసభలో ఏపీకి సంబంధించి ఆరు హామీలిచ్చాను. వాటిని తప్పకుండా అమలు చేయండి అని మన్మోహన్ డిమాండ్ చేశారు.

చిత్రం.. విభజన చట్టం సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని పట్టుబడుతూ రాజ్యసభలో పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యుల ఆందోళన