జాతీయ వార్తలు

కాశ్మీర్‌పై రాజ్‌నాథ్ ఆరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం తన శాఖ ఉన్నతాధికారులతో దేశంలో అంతర్గత భద్రతా పరిస్థతిపై సమీక్ష నిర్వహించారు. అయితే హోం మంత్రి నిర్వహించింది మామూలు సమీక్షా సమావేశమేనని, దీనిలో ప్రత్యేకత ఏమీ లేదని హోం శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ జమ్మూ, కాశ్మీర్‌లో రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం పర్యటించి వచ్చిన తర్వాత కూడా అక్కడి పరిస్థితిలో మార్పు రాని నేపథ్యంలో హోం మంత్రి ఈ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ ప్రధానంగా కాశ్మీర్‌లో పరిస్థితిపైనే ఆరా తీసినట్లు తెలుస్తోంది. గత జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జరిగినప్పటినుంచి కాశ్మీర్ లోయ హింసతో అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ జరిగి 65 రోజులు గడిచిపోయినప్పటికీ అక్కడ చాలా ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 80 మంది చనిపోగా, వేలాది మంది గాయపడ్డం తెలిసిందే. ఆందోళనలను అణచి వేయడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడి పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం.
కాగా, కాశ్మీర్‌లో పర్యటించిన అఖిలపక్ష బృందం వేర్పాటువాద నాయకులను కలవడానికి చేసిన ప్రయత్నిలు ఫలించక పోవడంతో వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. హింసను విడనాడాలని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన విజ్ఞప్తులను ఆందోళనకారులు పెడచెవిన పెట్టడంతో పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శితో పాటు ఐబి, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పుల్వామా జిల్లాలో ఆదివారం ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం