జాతీయ వార్తలు

మా ప్రాజెక్టులు చట్టబద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: పాలమూరు, డిండి ఎత్తిపోతల అమలులో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆమోదించిన ఈ రెండు పథకాలకు అభ్యంతరం పెట్టటం అర్థరహితమని తెలంగాణా ప్రభుత్వం బుధవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాదించింది. మొదటి కృష్ణా ట్రిబ్యునల్ మిగులు జలాలను ఉపయోగించుకునే అధికారం కల్పించినందుకే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు నీటిని కేటాయించిందని తెలంగాణా ప్రభుత్వం తమ ప్రజెంటేషన్‌లో వాదించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్వేకు 2013 ఆగస్టు 8న జి.ఓ నంబర్ 72 ద్వారా ఆదేశించారంటూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అనంతరం దీనిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణా వాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామనే హామీ ఇచ్చారని పేర్కొంది. డిండి ఎత్తిపోతలకు 2007లో 159 జి.ఓ ద్వారా పరిపాలనాపరమైన ఆమోదం తెలిపారన్నారు. ప్రధాని కార్యాలయం 2010లో దీనిని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలనే ప్రతిపాదన చేసిందని తెలంగాణా ప్రభుత్వం తమ ప్రజెంటేషన్‌లో వివరించింది. ఈ నేపథ్యంలో పాలమూరు, డిండి కొత్త ప్రాజెక్టులంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో నిజం లేదని తెలంగాణా వాదించింది. 9వ షెడ్యూలు రివర్ మేనేజ్‌మేంట్ బోర్డు నిర్వహణ నియమాలను మాత్రమే సూచిస్తోందన్నారు. కృష్ణాబేసిన్‌లో నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టుల వివరాలను మాత్రమే పొందుపరిచారని తెలంగాణా వాదించింది. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల గురించి వివరించనందున ఆ జాబితా అసంపూర్ణమన్నారు. అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసే ముందు కేంద్ర జలవనరుల శాఖ తమతో చర్చించలేదని తెలంగాణా ఆరోపించింది.
ఈ కమిటీలోని కొందరు సభ్యులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నదీ జలాలను అంచనా వేసేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ ఇది ఆశించిన స్థాయిలో జరగటం లేదన్నారు. పోలవరం నుండి 80 టిఎంసిల జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున దీనిలో తమకు వాటా ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించినందున దీనికి సంబంధించి వాటా జలాలను తెలంగాణాకు ఇవ్వాలని తెలంగాణా డిమాండ్ చేసింది. కృష్ణాబేసిన్‌కు సంబందించిన మెజారిటీ క్యాచ్‌మెంట్ ప్రాంతం తెలంగాణాలో ఉన్నందున తమకు ఈ జలాలపై హక్కు ఉన్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునే 512 టిఎంసి జలాల నుండి 350 టిఎంసిల జలాలను కృష్ణాబేసిన్ వెలుపల ఉపయోగిస్తోందని తెలంగాణా ప్రభుత్వం ఆరోపించింది. గోదావరి నుండి పోలవరం ద్వారా మళ్లించే 45 టిఎంసిల నుండి 30 టిఎంసిలతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువను అప్పటి ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలంగాణా వాదించింది. జల వివాదాల పరిష్కారాల విషయంలో తెలంగాణా పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని హామీ ఇచ్చింది.

బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో పరస్పరం కరచాలనం చేసుకుంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్