జాతీయ వార్తలు

వీడని నీటిముడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టిసీమ, పోలవరంలో మాకూ వాటా వెనక్కి తగ్గేది లేదన్న తెలంగాణ డిండి, పాలమూరుతో మాకు నష్టం
ప్రాజెక్టుల నిర్మాణం కూడదన్న ఆంధ్ర ఏకాభిప్రాయానికి తావులేని వాదనలు మూడు అంశాలపై ఇరుపక్షాలు ఓకే
ఇక అపెక్స్ కౌన్సిల్ భేటీలు ఉండవు జల సమస్యలపై వాళ్లే తేల్చుకోవాలి కేంద్ర జలవనరుల మంత్రి ప్రకటన

కృష్ణాపై రెండు రాష్ట్రాల్లో నిర్మించిన వివిధ ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది. ఏయే రాష్ట్రానికి ఎంత నీరు వెళ్తుందో లెక్కగట్టేందుకు టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు.
నదీపరీవాహక ప్రాంతాల్లో నీటి లభ్యత అంచనా వేసేందుకు కేంద్ర జల సంఘ నిపుణులు, రెండు రాష్ట్రాల సీనియర్ ఇంజనీర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
టెలిమెట్రీ ద్వారా వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి కమిటీ రూపొందించే నివేదికను బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్‌కు అందించి వీలైనంత త్వరగా తీర్పు అందించాలని విజ్ఞప్తి చేయటం.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం కొలిక్కొచ్చినట్టు లేదు. నీటి వాడకంపై తలెత్తిన వివాదాల పరిష్కారానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. అయితే, భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. తెలంగాణ చేపడుతున్న డిండి, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులు చట్ట విరుద్ధమని, వీటి నిర్మాణంతో తమ రాష్ట్రానికి తీరని అన్యాయం జరగుతుందని ఆంధ్ర వాదించింది. ఆంధ్రలో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు, నిర్మాణంలోవున్న పోలవరం ప్రాజెక్టుల నుంచి తమకు రావాల్సిన వాటా జలాలు ఇవ్వాలని తెలంగాణ గట్టిగా వాదించింది. ఈ అంశాలపై రెండు రాష్ట్రాలు తమ వాదనలకు కట్టుబడటంతో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఆశించిన ఫలితాలు అందలేదు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు.
మూడు అంశాలపై ఏకాభిప్రాయం
కృష్ణాపై రెండు రాష్ట్రాల్లో నిర్మించిన వివిధ ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది. ఏయే రాష్ట్రానికి ఎంత నీరు వెళ్తుందో లెక్కగట్టేందుకు టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అలాగే టెలిమెట్రీ ద్వారా సేకరించిన వివరాల అధ్యయనానికి కేంద్ర జల సంఘ నిపుణులు, రెండు రాష్ట్రాల ఇంజనీర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకూ అంగీకరించాయి. ఆ కమిటీ నివేదికను బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్‌కు అందించి వీలైనంత త్వరగా తీర్పు అందించాలని విజ్ఞప్తి చేయటం... ఈ మూడు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం ఈ విషయాన్ని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి మీడియాకు వెల్లడించారు. డిండి, పాలమూరు- రంగారెడ్డి, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు చేస్తున్న వాదనల గురించి మాట్లాడేందుకు ఉమాభారతి నిరాకరించారు. మూడు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరినందుకు సంతోషంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలాల సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించానన్నారు. ఇకమీదట అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగదని కూడా స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతాయి. అవసరమైతేనే తాను రెండు రాష్ట్రాలతో చర్చిస్తానని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై ఆంధ్ర, తెలంగాణలు తమతమ వాదనలకు కట్టుబడి ఉండటంతో ఉమాభారతి నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. డిండి, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని ఉమాభారతి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్దంగా నిర్మిస్తున్న డిండి, పాలమూరు ప్రాజెక్టుల కారణంగా ఆంధ్రలో 15 లక్షల ఎకరాల భూమి బీడువారే ప్రమాదం ఉందని ఆంధ్ర వాదించింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ఏపీ వాదించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 150 టిఎంసి నీటిని ఉపయోగించుకుంటే ఆంధ్రకు తీరని నష్టం వాటిల్లుతుందని వాదించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ వాదనను గట్టిగా ఖండించింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే రెండు ప్రాజెక్టులకు అనుమతి లభించింది కాబట్టి, ఇప్పుడు ఆంధ్ర అభ్యంతరం పెట్టటం అర్థరహితమని వాదించింది. వాస్తవానికి ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టులు పట్టిసీమ, పోలవరం నుంచి తెలంగాణకు న్యాయపరమైన వాటా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఉమాభారతి అధ్యక్షతన బుధవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులు, ఆంధ్ర సిఎం చంద్రబాబు, రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉమామహేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి టక్కర్, సీనియర్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభానికి ముందు ఇద్దరు సిఎంలు విడివిడిగా ఉమాభారతిని కలుసుకోవటం గమనార్హం. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు తమతమ వాదనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో బచావత్ ట్రిబ్యునల్ గతంలో చేసిన నీటి కేటాయింపులు, కృష్ణపై నిర్మించిన ప్రాజెక్టులు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులు, నీటి పంపిణీ, వినియోగానికి సంబంధించిన వివాదాలు, ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికపై రెండు రాష్ట్రాలు నీటిని పంపిణీ చేసుకుంటున్న విధానం, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను ప్రజెంటేషన్‌లో తెలియజేశారు.

చిత్రం... జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం ఉమాభారతితో చంద్రబాబు, కేసీఆర్