జాతీయ వార్తలు

సభలో ఇక సమరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: పెద్ద నోట్ల రద్దుతో తమను దెబ్బ తీసిన ప్రధాని మోదీని ఎదురుదెబ్బ కొట్టేందుకు విపక్షాలు వ్యూహాత్మక అడుగులేస్తున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని ఎదుర్కోవడానికి పార్టీలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయంలో తృణమూల్ కాంగ్రెస్, జెడి(యు), వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. మోదీ నిర్ణయాన్ని ఎదుర్కొనేందుకు పార్లమెంటు లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. బుధవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు, భోపాల్ వద్ద సిమి కార్యకర్తలు ఎదురుకాల్పుల్లో మరణించటం, ఓఆర్‌ఓపి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కోట్లాది ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిన పెద్దనోటు రద్దు నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీకి వస్తున్నారు. ఈ సందర్భంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించేలా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్టప్రతిని కోరనున్నారు.
ఇదిలావుంటే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జెడి (యు), వామపక్షాలు, ఆంఆద్మీ పార్టీ నాయకులతోపాటు ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ, మాయావతి నాయకత్వంలోని బిఎస్పీలు మంగళవారం మరోసారి సమావేశమై పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం సాధించేందుకే పెద్ద నోట్లను రద్దు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవినీతిని అరికట్టడం, నల్లధనాన్ని తొలగించేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామంటూ మోదీ చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని విపక్ష నేతలు వాదిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల సాధనకు ఎన్డీయే తీసుకున్న రద్దు నిర్ణయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
అనాలోచిత నిర్ణయం: కాంగ్రెస్
పెద్ద నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా దుయ్యబట్టారు. సుర్జేవాలా సోమవారం ఏఐసిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 125 కోట్ల మంది ప్రజలను మోదీ అకస్మాత్తుగా కష్టాల్లో పడవేశారన్నారు. బ్యాంకుల వద్ద క్యూలో నిలబడిన వారు దొంగలు కాదు. వారి వద్ద నల్లధనం లేదనేది మోదీకి తెలియదా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశంలోని ప్రజలందరికీ దొంగల ముద్ర వేశారని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు గురించి కొందరు పెద్దలకు ముందే తెలిపినట్టు స్పష్టమవుతోందని అన్నారు. రిజర్వు బ్యాంకు లెక్కలు పరిశీలిస్తే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 5.88 లక్షల కోట్లు డిపాజిట్ చేశారు. ఇలా ఎందుకు జరిగిందని ఆయన నిలదీశారు.
పనికిరాని 2వేల నోటు: సిపిఎం
ప్రభుత్వం విడుదలు చేసిన రెండు వేల రూపాయల నోట్లు ఎందుకూ పనికి రావటం లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు. ఏచూరి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల నోటు ఎవ్వరూ తీసుకోవటం లేదన్నారు. దాదాపు తొంబై శాతం నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్నారని 2014లో స్వయంగా ప్రకటించిన నరేంద్ర మోదీ, ఇప్పుడు పెద్ద నోట్లను రద్దు చేయటం ద్వారా ఏం సాధించారని ఏచూరి ప్రశ్నించారు. ఉగ్రవాదానికి సంబంధించిన ధనాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నప్పుడు పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని మోదీని ప్రశ్నించారు. కొత్త నోట్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని సూచించారు.

చిత్రం... పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ విపక్షాల దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా కోల్‌కతాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం