జాతీయ వార్తలు

ఏడుగురు పాక్ జవాన్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి భారత సైన్యం విరుచుకుపడింది. వాస్తవాధీన రేఖకు ఆవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భీంబర్ సెక్టార్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. తమ సైనిక పాటవాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఎలాంటి కవ్వింపు చర్య లేకుండానే ఏడుగురు తమ సైనికులను భారత సైన్యం హతమార్చిందని పాకిస్తాన్ సోమవారం ఆరోపించింది. భారత సైన్యం చర్యలను వ్యూహాత్మక తప్పిదంగా పాకిస్తాన్ పేర్కొంది. భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలేకు పిలిపించి తన తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత సైన్యం దూకుడుకు తమ సైన్యం గట్టిగా జవాబిస్తోందని పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌదరి తెలిపారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత రెండు మాసాలలో భారత్ వైపు నుంచి పలుమార్లు కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని ఆయన ఆరోపించారు. యుద్ధ వాతావరణం సృష్టిస్తున్న భారత సైన్యం వైఖరి ఆసియా ప్రాంతంలో శాంతి సామరస్యాలకు విఘాతం కలుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్ సంయమన వైఖరిని కొనసాగిస్తోందని, తమ విధానాన్ని బలహీనతగా భావించరాదని అజీజ్ చౌదరి హెచ్చరించారు. ఈ వారం రోజుల వ్యవధిలో భారత హైకమిషనర్‌కు పాకిస్తాన్ సమన్లిచ్చి పిలిపించటం రెండోసారి. అంతకు ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించారు. తమ భూభాగాన్ని కాపాడుకోవటానికి తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో సంసిద్ధంగా ఉందని షరీఫ్ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనిక దళాలు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని, అయితే తమ భూభాగాన్ని కాపాడుకోవటానికి తాము పూర్తి శక్తిసామర్థ్యాలతో సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ సమాచార శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.