జాతీయ వార్తలు

పెద్దనోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చిచెండాడారు. ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ వ్యవస్థీకృత దోపిడి, చట్టబద్ధ మోసానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జిడిపి రెండు శాతం పడిపోతుందని హెచ్చరించారు. గురువారం రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై జరిగిన చర్చలో మన్మోహన్ మాట్లాడుతూ నల్లధనం, దొంగనోట్ల అదుపు, ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలను అదుపు చేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామన్న నరేంద్ర మోదీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, పెద్దనోట్లను రద్దుచేసిన అనంతరం కొత్త నోట్ల పంపిణీలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పెద్దనోట్ల రద్దు ప్రక్రియలో దీర్ఘకాలం పాటు చిరస్థాయిగా ఉండిపోయే తప్పులు చేశారని మన్మోహన్ ఆరోపించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం తప్పులు చేసిందనటంలో దేశవ్యాప్తంగా రెండో అభిప్రాయం లేదన్నారు. పెద్దనోట్ల రద్దు వలన స్వల్పకాలం ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో దేశానికి మేలు జరుగుతుందనే వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, దీని ఫలితాలను అనుభవించేందుకు దీర్ఘకాలంలో ఎవరైనా బతికి ఉండాలి కదా అంటూ మన్మోహన్ వ్యంగ్య బాణాలు విసిరారు. రాత్రికి రాత్రి మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మూలంగా దేశంలోని కోట్లాది మంది బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించటంపై దృష్టిసారించాలని ఎన్‌డిఏ ప్రభుత్వానికి ఆయన హితవు చెప్పారు. మోదీ తీసుకున్న నిర్ణయం మూలంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తాను కూడా చెప్పలేను, ఈ అంశాన్ని తను పూర్తి బాధ్యతతో చెబుతున్నానని మన్మోహన్ అన్నారు. యాభై రోజులు వేచి ఉండాలని నరేంద్ర మోదీ చెబుతున్నారు, ఇది చాలా తక్కువ సమయమే కానీ దేశంలోని బడుగు, బలహీన వర్గాల వారికి ఈ యాభై రోజుల హింస, వేదన భయంకరమైన విపత్తును తెచ్చిపెడుతుందని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా ఇప్పటికే 60 నుండి 65 మంది మరణించారు, ఇంతకంటే ఎక్కువమంది కూడా మరణించి ఉంటారన్నారు.
నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వలన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ, నగదు వ్యవస్థ పట్ల అవిశ్వాసాన్ని కలిగిస్తుందని మన్మోహన్ హెచ్చరించారు. ప్రజలు బ్యాంకుల్లో పెట్టుకున్న తమ డబ్బును తీసుకునేందుకు అనుమతి ఇవ్వని ఒక్క దేశం పేరును ఉదహరించగలుగుతారా? అంటూ ఆయన మోదీని నిలదీశారు. మీరు చేసింది తప్పు అని చెప్పేందుకు, ఖండించేందుకు ఇది చాలంటూ మన్మోహన్ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు, దాన్ని అమలుచేసిన విధానం వల్ల వ్యవసాయం, చిన్న వ్యాపారస్తులు, అసంఘటిత రంగంలో ఉన్నవారికి తీరని నష్టం కలిగిస్తుందని ఆయన చెప్పారు. జిడిపి రెండు శాతం లేదా అంతకంటే ఎక్కువ పడిపోవచ్చునన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ప్రతి రోజూ కొత్తకొత్త నియమాలను ప్రకటిస్తున్నారు, డబ్బు తీసుకునేందుకు కొత్త ఆదేశాలు ఇస్తున్నారు, ఇదంతా ప్రధాని కార్యాలయం, ఆర్థిక మంత్రి కార్యాలయం, రిజర్వు బ్యాంకు అసమర్థతకు అద్దం పడుతోందంటూ దుయ్యబట్టారు. రిజర్వు బ్యాంకు సామర్థ్యం ఈ స్థాయికి పడిపోవటం సిగ్గుచేటన్నారు.
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు నరేంద్ర మోదీ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ సూచించారు. గ్రామీణ ప్రాంతంలోని అత్యధిక ప్రజలకు సేవచేసే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ పని చేయటం లేదు, సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా డబ్బు పంపిణీ చేయటం లేదని ఆయన ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ప్రధాని మోదీ వౌనం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చీల్చిచెండాడుతుంటే సభలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వౌనం వహించారు తప్ప ప్రతిస్పందించలేదు. మన్మోహన్ చెప్పినదంతా సావకాశంగా విన్న మోదీ, భోజన విరామం కోసం రాజ్యసభ వాయిదా పడినప్పుడు ప్రతిపక్ష నాయకుల వద్దకు వెళ్లి అందరితో కరచాలం చేస్తూ ముచ్చటించారు. ఆయన మన్మోహన్ వద్దకు వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం ఒక నిమిషం పాటు మాట్లాడటం గమనార్హం. పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఎన్‌డిఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించటంతోపాటు భజనపరులైన మంత్రులతో జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ సభ్యుడు నరేష్ అగర్వాల్‌తో కూడా కొద్దిసేపు ముచ్చటించారు. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ, జెడియు నాయకుడు శరద్‌యాదవ్, బిఎస్‌పి అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ పక్షం నాయకుడు రాంగోపాల్ యాదవ్‌తో కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్‌తో కూడా కరచాలనం చేసి అర నిమిషం పాటు మాట్లాడటం గమనార్హం.

చిత్రం... రాజ్యసభలో ప్రసంగిస్తున్న
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్