జాతీయ వార్తలు

ఇపిఎఫ్‌ఓ పెన్షనర్లకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఇపిఎఫ్‌ఓ ప్రకటించింది. జనవరి 15లోగా యాభై లక్షల మంది పెన్షనర్లు తమ జీవన సర్ట్ఫికెట్‌ను సమర్పించవచ్చునంటూ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇపిఎఫ్‌ఓ అధికారి తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానుగుణంగానే పెన్షనర్లకు ఈ అదనపు గడువు అందిస్తున్నామని వెల్లడించారు. నవంబర్‌లోగా లైవ్ సర్ట్ఫికెట్లను అందించని పక్షంలో సదరు పెన్షనర్లకు పెన్షన్ మొత్తాన్ని నిలిపివేస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ గడువును వచ్చే ఏడాది జనవరి 15వరకు పొడిగించడం జరిగిందని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న సర్వీసు కౌంటర్లలో పెన్షనర్లు తమ సర్ట్ఫికెట్లను దఖలు చేయవచ్చునని తెలిపారు.

మసూద్ సహా నలుగురు ఉగ్రవాదుల ప్రాసిక్యూషన్

పఠాన్‌కోట్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఎకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ, నవంబర్ 28: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కేసులో జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్, మరో ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం అనుమతి ఇచ్చింది. పఠాన్‌కోట్ దాడితో సంబంధం ఉన్న మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్, మరో ఇద్దరు సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాల్సిందిగా ఎన్‌ఐఎ ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం-1967, పేలుడు పదార్థాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని హత్య, నేరపూరిత కుట్ర, భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేయడంసహా వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్‌ఐఎ లాంఛనంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కోరింది. ప్రాసిక్యూషన్ అనుమతి వస్తే వారిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి వీలు కలుగుతుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలకు చెందిన నలుగురు ఆత్మాహుతి దళానికి చెందిన ఉగ్రవాదులు జనవరి ఒకటవ తేది రాత్రి పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోనికి చొరబడి ఏడుగురు భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఈ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన అభియోగాలను అజర్ ఎదుర్కొంటున్నాడు. పార్లమెంటుపై దాడి, 2001లో శ్రీనగర్ అసెంబ్లీ వద్ద బాంబు పేలుళ్ల కేసులుసహా అనేక ఉగ్రవాద కేసుల్లో సూత్రధారి అయిన అజర్‌కోసం భారత్ గాలిస్తోంది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆంక్షల కమిటీతో మసూద్ అజర్‌పై నిషేధం విధింపచేయడానికి భారత్ ప్రయత్నిస్తోంది. 1993 నుంచి అతను నిర్వహించిన ఉగ్రవాద కార్యకలాపాల చిట్టాను భారత్ ఇదివరకే సమర్పించింది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారుల్లో అజర్ ఒకడని స్పష్టంగా పేర్కొంది.

బలోచ్ నేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ హత్య కేసు

ముషారఫ్‌కు అరెస్టు వారెంట్

ఇస్లామాబాద్, నవంబర్ 28: బొలోచ్ నేషనలిస్టు నేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ హత్య కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై అరెస్టువారెంట్ జారీ అయింది. 2006 సైనిక చర్య సందర్భంగా బుగ్తీ దారుణ హత్యకు గురయ్యారు. అప్పటి సైనిక ప్రధానాధికారి ముషారఫ్‌కు బలోచిస్తాన్ హైకోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇదే కేసులో 73 ఏళ్ల ముషారఫ్‌ను నిర్దోషిగా పేర్కొంటూ డివిజనల్ కోర్టు ఇచ్చిన తీర్పును బలోచిస్తాన్ హైకోర్టులో సవాల్ చేశారు. హతుడు అక్బర్‌ఖాన్ బుగ్తీ కుమారుడు నవాబ్‌జాదా జమీల్ బుగ్తీ దాఖలు చేసిన రివ్యూపిటిషన్‌ను విచారించిన జస్టిస్ జమాల్ మండొఖైల్, జస్టిస్ జహీరుద్దీన్ కకార్ మాజీ సైనికాధ్యక్షుడిపై అరెస్టు వారెంట్ జారీచేశారు. భద్రతాకారణాల దృష్ట్యా తన్ల క్లయింట్ విచారణకు హాజరుకాలేరని ముషారఫ్ తరఫు న్యాయవాది అక్తర్‌షా కోర్టుకు విన్నవించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే మాజీ సైనిక అధ్యక్షుడు కోర్టుకు గైర్హాజరవుతున్నారని బుగ్తీ తరపు న్యాయవాది ఆరోపించారు. ముషారఫ్ విచారణకు హాజరయ్యేందుకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోర్టు ఆధికారులను ఆదేశించింది. కాగా ముషారఫ్ వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలు వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2006 ఆగస్టులో జరిగిన సైనిక చర్య సందర్భంగా కొహ్లూ జిల్లా తరాతని పర్వత ప్రాంతంలో బోలోచ్ నేషనలిస్టు చీఫ్ నవాబ్ అక్బర్‌ఖాన్ బుగ్తీ దారుణ హత్యకు గురయ్యారు.