జాతీయ వార్తలు

పసలేని రా.గా నస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు (2013, 2014) సహారా, బిర్లా సంస్థల నుంచి 52.5 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన తాజా విమర్శ కాంగ్రెస్ బుడగనే పేల్చేసింది. సుప్రీంకోర్టు కొట్టివేసిన పాత ఆరోపణలనే రాహుల్ తాజాగా ఎక్కుపెట్టడంపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. బుధవారం గుజరాత్‌లోని మెహసానాలో పార్టీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ 2013లో అప్పటి గుజరాత్ సిఎం నరేంద్ర మోదీకి సహారా సంస్థ ఐదు కోట్ల చొప్పున ఏడుసార్లు, రెండున్నర కోట్ల చొప్పున రెండుసార్లు ముడుపులు సమర్పించుకుందని ఆరోపించారు. ఆదిత్య బిర్లా సంస్థ నుంచి ఇరవై కోట్లకుగాను తొలివిడతగా 12.5 కోట్లు నరేంద్ర మోదీకి ముడుపులు అందాయని ఆరోపించారు. కేంద్ర ఆదాయ పన్ను శాఖ సహారా, బిర్లా సంస్థలపై చేసిన దాడుల్లో ముడుపులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయన్నది రాహుల్ తాజా సమాచారం. వాస్తవానికి రాహుల్ తాజా ఆరోపణలు దాదాపు 20 రోజుల క్రితం ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ అసెంబ్లీలో చేసిన ఆరోపణలే. బిర్లా సంస్థపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసినపుడు దొరికిన ఒక డైరీలోని అంశాన్ని అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ, మోదీకి మొత్తం 20 కోట్ల ముడుపులకుగాను తొలి విడతగా 12.5 కోట్లు చెల్లించినట్లు రాసిఉందన్నారు. ఇదిలావుంటే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తమ ఎన్జీవో తరపున సుప్రీంకోర్టులో ఈ ముడుపులపై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీకి ముడుపులు ముట్టాయని పిటిషన్‌లో ఆరోపించారు. ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడినట్టు రుజవులు లేవని స్పష్టం చేసింది. సహారా, బిర్లా సంస్థలకు చెందిన అధికారులు తమ డైరీలో మోదీకి ముడుపులు చెల్లించినట్టు రాసుకున్నంత మాత్రాన అవి నిజం ఎలా అవుతాయని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న సాక్ష్యం తెచ్చినా చర్య తీసుకుంటామని సుప్రీం న్యాయమూర్తులు కెహెర్, మిశ్రాలు సూచించారు. న్యాయమూర్తులు కెహెర్, మిశ్రాలు ఈనెల 16న ఇచ్చిన తీర్పులో ప్రధాని మోదీపై ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణలను కొట్టేశారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయటం తగదని కూడా న్యాయమూర్తులు సూచించారు. ఇంత జరిగాక, సుప్రీం కోర్టు కొట్టివేసిన పాత ఆరోపణలనే తాజాగా రాహుల్ సంధించడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. పది రోజుల క్రితం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మోదీపై వ్యక్తిగత అవినీతికి ఆరోపణలు చేయటం తెలిసిందే. మోదీ అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడితే భూకంపమేనని సవాల్ చేశారు. ఆ భయంతోనే పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వటం లేదని కూడా రాహుల్ ఆరోపించారు. చివరకు సోషల్ మీడియాలో సైతం అరిగిపోయన పాత ఆరోపణలనే రాహుల్ తాజాగా ఎందుకు ప్రస్తావించారో అర్థంగాక కాంగ్రెస్ నేతలు, శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.

చిత్రం... గుజరాత్ బహిరంగ సభలో రాహుల్‌కు
సంప్రదాయ కోటు తొడుగుతున్న పార్టీ నేతలు