జాతీయ వార్తలు

రెవెన్యూ లోటు భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: రాష్ట్రానికి రావలసిన రెవెన్యూ లోటు 12,099 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ఏ.పి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.
అరుణ్ జైట్లీ బుధవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో 2017-18 సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూపకల్పన గురించి చర్చించారు. యనమల ఈ సందర్భంగా జైట్లీకి పలు సూచనలు చేయటంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన నిధుల గురించి వివరించారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో జిఎస్‌డిపిపై ఉన్న పరిమితిని మూడు శాతం నుండి నాలుగు శాతానికి పెంచాలని రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. 2014 సంవత్సరానికి సంబంధించి రావలసిన రెవెన్యూ లోటు 12,099 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆయన జైట్లీకి చెప్పారు. పెద్దనోట్ల రద్దు వలన రాష్ట్ర ఆదాయం దాదాపు 30 శాతం తగ్గే అవకాశం ఉన్నందున ఈ లోటును పూరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన లాండ్ పూలింగ్‌కు తమ భూములను ఇచ్చి త్యాగం చేసిన రైతులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 32 వేల కోట్ల విదేశీ సహాయ ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలన్నారు. జిల్లా, మండల పరిషత్ రోడ్ల నిర్వహణ, తాగునీటి పథకాలకు 14వ ఆర్థిక సంఘం కింద తగినన్ని నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఇవ్వజూపిన ప్రత్యేక ప్యాకేజీని వీలున్నంత త్వరగా అమలు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు మిగతా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన జైట్లీకి విజ్ఞప్తి చేశారు.